గ‌డ్చిరౌలిపై అర్బ‌న్ న‌క్స‌ల్స్ దుష్ప్ర‌చారం

గ‌డ్చిరౌలిపై అర్బ‌న్ న‌క్స‌ల్స్ దుష్ప్ర‌చారం
విదేశీ నిధుల‌తో గ‌డ్చిరోలిపై అర్బ‌న్ న‌క్స‌ల్స్ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నార‌ని మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఆరోపించారు. లాయిడ్స్ మెట‌ల్స్ అండ్ ఎన‌ర్జీ లిమిటెడ్ సంస్థ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ గ‌డ్చిరౌలి జిల్లాలో జ‌రిగిన వేర్వేరు ప్రాజెక్టుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. గ‌డ్చిరౌలిలో న‌క్స‌లిజం త‌గ్గుతోంద‌ని, ప్ర‌స్తుతం కొంత మంది న‌క్స‌లైట్లు మాత్ర‌మే ఉన్నార‌ని పేర్కొంటూ వాళ్ల‌ను వేళ్ల మీద లెక్క‌పెట్ట‌వ‌చ్చు అని, ఇక్క‌డి అడ‌వుల్లో వాళ్లు ఉన్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
హింస‌ను వీడాల‌ని న‌క్స‌లైట్లకు అప్పీల్ చేస్తున్న‌ట్లు సీఎం ఫ‌డ్న‌వీస్ తెలిపారు. ప్ర‌ధాన జీవ‌న‌స్ర‌వంతిలో క‌ల‌వాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. అయితే గ‌న్ ప‌ట్టుకుని తిరిగే న‌క్స‌లైట్లు త‌గ్గుతున్న ద‌శ‌లో అర్బ‌న్ న‌క్స‌ల్స్ సంఖ్య పెరుగుతోంద‌ని సీఎం ఫ‌డ్న‌వీస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అర్బ‌న్ న‌క్స‌ల్స్ ప‌ట్ల అప్రమత్తంగా ఉండాల‌ని హెచ్చరించారు.  వాళ్లు త‌ప్పుడు స‌మాచారాన్ని చేర‌వేస్తున్నార‌ని, గ‌డ్చిరౌలిలో స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాప‌న చేయ‌గా, మ‌రుస‌టి రోజే సోష‌ల్ మీడియాలో దుష్ ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని, గిరిజ‌నుల‌ను చంపుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్న‌ట్లు సీఎం ఆరోపించారు. 

భారీ స్థాయిలో అడువుల్ని న‌రికివేస్తున్న‌ట్లు ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంటే, ఎలా వ్య‌తిరేక క్యాంపేన్ చేప‌డుతున్నార‌ని ఆయ‌న అడిగారు. మ‌హారాష్ట్ర‌కు సంబంధం లేని వ్య‌క్తులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. ఇద్ద‌రు కోల్‌క‌తాలో ఉన్నార‌ని, మ‌రో ఇద్ద‌రు బెంగుళూరులో ఉన్నార‌ని, వాళ్లు విదేశీ నిధుల‌తో ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు.

ఆ వ్య‌క్తులు విదేశీ నిధుల‌తో.. సోష‌ల్ మీడియా పోస్టుల‌తో ప్ర‌జ‌ల్ని రెచ్చ‌గొడుతున్నార‌ని సీఎం ఫ‌డ్న‌వీస్ పేర్కొన్నారు. అబ‌ద్దాలు చెబుతూ అర్బ‌న్ న‌క్స‌ల్స్ గ‌డ్చిరౌలిని అభివృద్ధికి దూరం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన గడ్చిబోలి ఇప్పుడు దేశంలో ప్రముఖ స్టీల్ ఉత్పత్తి కేంద్రంగా మారబోతోంది, పారిశ్రామీకరణ వేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.