అభిశంసన తీర్మానంపై 200 మంది ఎంపీల సంతకాలు

అభిశంసన తీర్మానంపై 200 మంది ఎంపీల సంతకాలు

తన నివాసంలో నోట్ల కట్టలు లభ్యమైన వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై 200 మందికిపైగా ఎంపీలు పార్లమెంటులో సోమవారం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 145 మంది ఎంపీలు, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఈ తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందించారు. లోక్‌సభలో ఈ నోటీసులు అందించిన ఎంపీల్లో అనురాగ్ ఠాకూర్, రవిశంకర్ ప్రసాద్, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీపీ చౌదరి, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, 217, 218 కింద ఈ నోటీసులు అందించారు.  జడ్జీ తొలగింపునకు సంబంధించిన తీర్మానంపై కనీసం 100 మంది లోక్‌సభ‌ ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. 145 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసినందుకు ఈ తీర్మానం తదుపరి దశకు చేరడం దాదాపు ఖాయమైంది. దీనిపై రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు. 

నివాసంలో నోట్ల కట్టలు లభ్యమైన వ్యవహారంతో తనకు సంబంధం లేదని జస్టిస్ యశ్వంత్ వర్మ అంటున్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత దర్యాప్తు కమిటీ విచారణ జరిపి, నోట్ల కట్టలు లభ్యమైన స్టోర్ రూంపై జడ్జి, ఆయన కుటుంబానికే పూర్తి పట్టు ఉందని తేల్చింది.