
ఏపీలో తాము మళ్ళీ అధికారంలోకి వస్తామని, అధికారుల అంతే చూస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరికలు చేయడం పట్ల బీజేపీ ఎమేల్సి సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని, లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. జగన్ అజ్ఞానరహితంగా మాట్లాడుతున్నారని పేర్కొంటూ అధికారులను జగన్ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు జైలుకి వెళ్తున్నారని, కొందరు అధికారులకు ఆరోగ్యాలు పాడైపోయాయని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.420కి నెయ్యి కొని తిరుపతిలో లడ్డూ తయారు చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. అధికారంలోకి జగన్ మళ్లీ వస్తే నెయ్యి రూ.320కి కొంటారా? అని ప్రశ్నించారు.
జగన్ పరిపాలనలోని వైఫల్యాలనే తాను ప్రశ్నిస్తున్నానని చెబుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు జైలుకి వెళ్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. వైసీపీ పరిపాలనలోని లోపాలు ఆ పార్టీ నేతలకి అర్థం కావటం లేదా? అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు ఏం చేయించారో ఒకసారి రికార్డులు వెనక్కి తీయిస్తే వారు చేసిన అరాచకాలు బయటపడుతాయని చెప్పుకొచ్చారు.
జగన్ ప్రతిపక్ష నేతగా కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరని, మళ్లీ మీరు అధికారంలోకి రావడం అసాధ్యం కాగలదని విమర్శించారు 2029లో కూడా మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో రోడ్డుపై ఒక్క గోయ్యి కూడా ఎందుకు పూడ్చలేదని ప్రశ్నించారు. జగన్ పాలనలో రమ్మీలు ఆడించారని ఆరోపించారు. గతంలో తనను గుడివాడ కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు.
తనకు రామతీర్థం నుంచి కపిలం తీర్థం వెళ్లటానికి కూడా జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అప్పులు చేయటం జగన్‌కే బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి రోజూ ఢిల్లిలో ఎందుకు ఉండేవారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీపై ఉన్న గౌరవమే తెలంగాణపైనా ఉందని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బనకచర్లకు అనుకూలంగా మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కోరారు.
More Stories
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800