ముగిసిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలు

ముగిసిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలు

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్‌-అమెరికా మధ్య ఐదో రౌండ్ చర్చలు ముగిశాయి. వాషింగ్టన్​లో జులై 14 నుంచి నాలుగు రోజులు పాలు ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత అధికారి తెలిపారు. భారత్ బృందం తిరిగి వస్తోందని చెప్పారు. వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్, భారత్​ బృందానికి చీఫ్ నెగోషియేటర్​గా వ్యవహరించారు. ఈ ఐదో దశ చర్చల్లో వ్యవసాయం, ఆటోమొబైల్‌ సంబంధిత అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని సమాచారం.

వాటితోపాటు నాన్- మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను ఎదుర్కొవడానికి మార్గాలు, స్పెషల్ కెమికల్స్, ఆర్గానిజమ్స్, మెటీరియల్స్, ఎక్విప్​మెంట్, టెక్నాలజీస్ అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది.  వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారీఫ్‌ల్లో రాయితీలు ఇవ్వడానికి భారత్​ ఇష్టపడటంలేదు. అసలు భారత్​ ఈ రంగాల్లో ఏ దేశానికి ఎలాంటి రాయితీలు కల్పించలేదు. అయితే వ్యవసాయానికి సంబంధించిన ఏ అంశాలను కూడా వాణిజ్య ఒప్పందంలో చేర్చవద్దని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

మరోవైపు భారత్​, 26 శాతం టారిఫ్‌లను అమెరికా తొలగించాలని కూడా బలంగా కోరుతోంది. ఇక స్టీల్‌పై 50శాతం, ఆటో సెక్టార్‌పై 25శాతం పన్ను తొలగించాలని కోరుతుంది. వీటికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కును భారత్​కు ఉందని ఉందని పేర్కొంది.  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా టెక్ట్స్​టైల్స్​, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, పాస్టిక్​లు, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటిపళ్లు వంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్​కు సుంకాల విషయంలో భారత్​ రాయితీ కోరుతోంది.

భారత్‌ పూర్తి స్థాయి ద్వైపాకిక్ష వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ట్రంప్ అదనపు టారిఫ్‌లు ఆగస్టు 1వ తేదీ నుంచే అమలు కానున్నాయి. ఈ లోపే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం కోసం ఈ చర్చలు కీలకం కానున్నాయి. భారత్​తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్ 2న విధించే అధిక సుంకాల 26శాతం గురించి ప్రకటించారు. 

ప్రస్తుతం అమెరికాతో అనేక దేశాలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపుతున్నందున్న అధిక సుంకాల అమలును  జులై 9 వరకు 90రోజుల పాటు తాత్కాలిక వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టు 1 వరకు పొడిగించారు. 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమెరికాకు భారత్​ ఎగుమతులు 22.8 శాతం పెరిగి 25.51 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 11.68 శాతం పెరిగి 12.86 బిలియన్ డాలర్లకు చేరాయి.