ఉప్పాడ తీరాన్ని కాపాడేందుకు రక్షిత గోడ

ఉప్పాడ తీరాన్ని కాపాడేందుకు రక్షిత గోడ
 
ఉప్పాడను చాలాకాలంగా వేధిస్తున్న తీర ప్రాంత కోత సమస్య రూ.323 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ద్వారా ప్రతిపాదనలను ఎన్డీయే ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
 
“గత ఐదేళ్లలో సగటున ఏటా 1.23 మీటర్ల తీరం కోతకు గురైంది, దీంతో సుమారు 12 మీటర్ల తీరం కోల్పోయింది. ఇది సమీప గ్రామాలపై, ముఖ్యంగా మత్స్యకారుల గృహాలపై తీవ్ర ప్రభావం చూపిం ది. ఎన్డీఏ ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి, అవసరమైన అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.

కేంద్రం ఇచ్చే నిధులతో ఉప్పాడ వద్ద రక్షిత గోడ నిర్మాణం జరిగితే ఇక అక్కడ గ్రామానికి సముద్ర ముప్పు తొలగిపోతుంది. ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు, సముద్ర ఆటుపోట్లకు సైతం తీరం కోతకు గురికాకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉప్పాడ వద్ద తీర ప్రాంతం కోతకు గురవుతుండటంతో ఈ గ్రామ ప్రజల ఇళ్లు సముద్రంలో కలిసి పోతున్నాయి. అంతే కాదు సముద్రం ఎప్పుడు వచ్చి తమ ఇళ్లను ముంచేస్తుందో, తనలో కలిపేసుకుంటుందో తెలియక ఇక్కడి మత్సకారులకు నిద్రపట్టడం లేదు.

ఏపీలో గత ఎన్నికల సమయంలో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఉప్పాడ గ్రామం వద్ద తీర ప్రాంతం భారీగా కోతకు గురవుతున్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంతం కోతకు గురి కాకుండా కాపాడతామంటూ పవన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం వద్దకు ఇక్కడ తీర ప్రాంత రక్షిత గోడ కట్టాలని ప్రతిపాదనలు తయారు చేయించి పంపారు.