* ప్రభుత్వ నిర్లక్ష్యం దాచిపెట్టేందుకు ఆర్సీబీపై నిందలా?.. బిజెపి ఆగ్రహం
ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అందుకు ఆర్ర్సీబీనే కారణమని పేర్కొంటూ సిద్దరామయ్య ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదిక రాజకీయ దుమారం రేపుతోంది.
విజయోత్సవ పరేడ్ విషయంలో ఆర్సీబీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించిందని, పోలీసులను సంప్రదించకుండా పెద్ద ఎత్తున అభిమానులను ఈవెంట్‌కు ఆహ్వానించినట్లు ప్రభుత్వ నివేదిక ఆరోపించింది. అయితే ఈ నివేదికపై బిజెపి ఆగ్రవేశాలు వ్యక్తం చేసింది. ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయాన్ని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని చూసిందని ఆరోపించింది.
ఆ నివేదికలో విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీపై నేరుగా వేలు చూపించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం దాచిపెట్టేందుకు ఇటువంటి నిందలు వేయడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. నిజంగా ఆర్సీబీదే తప్పైతే పోలీస్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. విజయోత్సవ పరేడ్ కోసం ఆర్సీబీ యాజమాన్యం కేవలం సమాచారం మాత్రమే ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది.
నిబంధనల ప్రకారం ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులూ కోరలేదని తెలిపింది. ఐపీఎల్‌లో విజయం అనంతరం ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్టు పెట్టినట్లు తెలిపింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ వేడుకకు ఉచిత ప్రవేశమని ప్రకటించింది. దీంతో స్టేడియం సామర్థ్యానికి మించి 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇలాంటి ఈవెంట్‌ల కోసం కనీసం ఏడు రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.
నిర్వాహకులు సరైన ప్రణాళికలు లేకపోవడం, సంబంధిత అధికారులకు ముందస్తు సమాచారం అందించడంలో విఫలం కావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. రోజువారీ సగటు ఆరు లక్షలతో పోలిస్తే అధికమని పేర్కొంది. లైసెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ ప్రొసెషన్స్ (బెంగళూరు సిటీ) ఆర్డర్,2009 ప్రకారం నిర్వాహకులు ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. కేవలం సమాచారం ఇవ్వడం, బెంగళూరులో భారీ బహిరంగ సభలకు సంబంధించి అనుమతి తీసుకోవడం ఒకటి కాదని పునరుద్ఘాటించింది.
అయితే, ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆహ్వానం పలికారని, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లు పౌరులకు మళ్లీ మళ్లీ పిలుపునిచ్చారని బీజేపీ నేత అరవింద్ మండిపడ్డారు. ఆ వేడుక విజయాన్ని తమ క్రెడిట్‌గా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ నాయకులు ముందుకు వచ్చారని ఆరోపించారు. ఆర్సీబీ ఈవెంట్ నిర్వహిస్తామని ముందుగా తెలిపిందని, అప్పటిలోనే అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం దాన్ని ఆపేయొచ్చని బీజేపీ గుర్తు చేసింది.
ప్రభుత్వమే ప్రొగ్రాంకు అనుమతి ఇచ్చి, తరువాత బాధ్యత వదులుకోవడం చింతించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి దారుణ ఘటనపై గట్టిగా స్పందించాల్సింది పోయి, నాయుకుడిపై ఒత్తిడి తేవడమేమిటని ప్రశ్నించారు.
కాగా, ఈ నివేదికతో రాజకీయ విమర్శలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం కోహ్లీ, ఆర్సీబీపై నిందలు వేయడం వల్ల అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజంగా బాధ్యులు ఎవరు? అసలైన సత్యం బయటపడే వరకు ఈ వివాదం కొనసాగనుంది.సాధారణమైన క్రికెట్ వేడుకను రాజకీయ రంగంలోకి లాగడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విరాట్‌ను రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది.

More Stories
ధ్వజారోహణం హిందూత్వ అభ్యున్నతి , అస్తిత్వ ప్రతీక
హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు!
నాలుగు లేబర్ కోడ్ ల అమలు స్వాగతించిన బిఎంఎస్