
డ్రూజ్ మైనారిటీలపై సిరియా బలగాలు దాడులు చేశాయి. దీంతో డ్రూజ్ మైనారిటీలను కాపాడేందుకు ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. తమ దేశంలోని భిన్న మతస్తులను పరిరక్షిస్తానని వాగ్దానం చేసిన సిరియా కొత్త నాయకుడు అహ్మద్ అల్ షరా డ్రూజ్ మతస్తులు, అలావైట్ తెగపై దాడులను నివారించడంలో విఫలం చెందారు. మార్చిలో మాజీ నియంత బషర్ అల్ అసద్‌కి చెందిన అలావైట్ తెగపై సిరియా సైన్యం విరుచుకుపడడంతో వందలాది మంది మరణించారు.
ఏప్రిల్‌లో ప్రభుత్వ అనుకూల సాయుధ దళాలు, డ్రూజ్ తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఘర్షణలలో 100 మందికి పైగా మరణించారు. తాజాగా సిరియా సైన్యానికి, డ్రూజ్ తిరుగుబాటుదారులకు మధ్య మళ్లీ ఘర్షణలు జరుగుతున్నాయి. ఆయుధాలు వదిలిపెట్టాలని షరా ఇచ్చిన పిలుపు కారణంగా ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది.
కాగా, డమాస్కస్‌లో తమ హెచ్చరికలు ముగిసిపోయాయని, ఇక శక్తివంతమైన దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతకు ముందు స్వీడా నుంచి సైనిక దళాలను ఉపసంహరించాలని, డ్రూజ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని కట్జ్ సిరియాలోని ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇజ్రాయెల్‌లోని డ్రూజ్ ప్రజలతో తమకు గాఢమైన సోదర అనుబంధం ఉన్న కారణంగా వారికి హాని జరగకుండా చూసుకోవలసిన బాధ్యత తమకు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. సిరియాలోని డ్రూజ్ పౌరులతో తమకు చారిత్రక బంధం ఉందని కూడా తెలిపింది. అరబ్ తెగకు చెందిన డ్రూజ్ మతస్తులు సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లో వ్యాపించి ఉన్నారు.
ఈజిప్టు సంతతికి చెందిన వీరు ఇస్లాంని పాటిస్తారు. మతమార్పిడిని, మతాంతర వివాహాన్ని వీరు అంగీకరించరు. 1967లో ఆరు రోజుల యుద్ధంలో సిరియా నుంచి చేజిక్కించుకున్న గోలన్ హైట్స్ పీఠభూమిలో 20,000 మందికిపైగా డ్రూజ్ ప్రజలు నివసిస్తున్నారు. 1981లో ఈ పీఠభూమి ఇజ్రాయెల్‌లో లాంఛనంగా విలీనమైంది. ఈ ప్రాంతంలో 25,000 మంది యూదు వలసదారులు కూడా నివసిస్తున్నారు. సిరియాలోని సువేదా ప్రావిన్సులో డ్రూజ్ మతస్తుల ప్రాబల్యం అధికం.
More Stories
వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ప్రారంభ వికాసం
రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్
ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా పాక్ సైనికులు హతం