కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మొదటిసారిగా ఈడీ నగదు లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు నిధులను అక్రమంగా సొంత కంపెనీల్లో, విదేశీ ఖర్చుల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ, ఏసీబీ నుంచి మురళీధర్ రావు, నూనె శ్రీధర్, హరిరామ్ నాయక్‌లకు సంబంధించిన అవినీతి కేసు వివరాలను కోరనుంది. వీరి ముగ్గురు వద్ద సుమారు రూ 1,000 కోట్ల ఆస్తులను ఎసిబి గుర్తించింది. ఈ విచారణ ద్వారా, ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం, బినామీ లావాదేవీలు, అక్రమాస్తుల సముపార్జన వంటి అంశాలను లోతుగా పరిశీలించనుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంతో సహా 10 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా, దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. ఇందులో విల్లాలు, ఫ్లాట్‌లు, ఓపెన్ ప్లాట్‌లు, వాణిజ్య భవనాలు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం వంటివి ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులో పనిచేసిన మరికొంత మంది ఇంజనీర్లపై కూడా ఈడి దృష్టి సారించింది. ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో ఖరీదైన డెస్టినేషన్ వెడ్డింగ్‌లు నిర్వహించడం వంటి అక్రమాలపై ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు, ఎక్స్‌క్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరిరామ్ నాయక్ సహా పలువురిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈడీ దృష్టి ఇప్పుడు మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు నడుపుతున్న కంపెనీలపై కూడా ఫోకస్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత లావాదేవీల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును అభిషేక్ రావు కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పెట్టుబడులపై ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏసీబీ గుర్తించిన ఆస్తులు, లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు కోరనున్నారు.
ఎక్స్‌క్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ప్యాకేజీలలో పనిచేశారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. 13 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 4500 చదరపు అడుగుల ఫ్లాట్, విల్లా, 19 రెసిడెన్షియల్ ప్లాట్‌లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హోటల్ పెట్టుబడులు వంటి ఆస్తులు గుర్తించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రీధర్ తన కొడుకు పెళ్లి కోసం థాయ్‌లాండ్‌లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించారు. ఈ ఖర్చులపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ లావాదేవీల వెనుక ఉన్న ఆర్థిక వనరులను గుర్తించేందుకు విచారణ చేపడుతోంది.
మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ భూక్యా హరిరామ్ నాయక్ ను కూడా ఈ కేసులో ఏసీబీ ఏప్రిల్‌లో అరెస్టు చేసింది. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, విలాసవంతమైన విల్లాలు, భూములు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు వంటి ఆస్తులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అక్రమ లావాదేవీల ద్వారా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు