21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నది. ఇందులో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల్లు సైతం ఉన్నది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలుస్తోంది. 
ఈ ఏడాది ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పాలన కోసం ప్రభుత్వం ప్రతి ఆరునెలలకోసారి పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గడువు ఆగస్టు 13తో ముగియనున్నది.
 
అలాగే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వి మణిపూర్‌ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025, పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025, పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025, జియో-హెరిటేజ్ సైట్స్ అండ్‌ జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025, గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025, జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025లను కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని చూస్తున్నది.
 
దాంతో పాటు గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024, మర్చంట్ షిప్పింగ్ బిల్లు 2024, ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2025, ఆదాయపు పన్ను బిల్లు 2025 కూడా లోక్‌సభలో ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలలో ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లో కేంద్రం 16 బిల్లులను ఆమోదించాయి. బడ్జెట్‌ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. అయితే, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సమర్పించిన తర్వాత.. వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 ఆమోదం పొందింది.