
దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం ఉదయం ఐదు ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. దీంతో పాఠశాల సిబ్పంది, తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటాల యుద్ధం జరుగుతోంది. మూడు రోజుల్లో ఇప్పటి వరకు తొమ్మిది పాఠశాలలకు 10 బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, బుధవారం ఉదయం ద్వారకలోని సెయింట్ థామస్ పాఠశాలను పేల్చివేస్తామంటూ మెయిల్ వచ్చినట్లు బుధవారం ఉదయం 5:26 గంటలకు తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది.
అలాగే ఉదయం 6:30 గంటలకు వసంత్ కుంజ్లోని వసంత్ వ్యాలీ స్కూల్, 8:12 గంటలకు హౌజ్ ఖాస్లోని మదర్ ఇంటర్నేషనల్ స్కూల్, 8:11 గంటలకు రిచ్మండ్ గ్లోబల్ స్కూల్ నుంచి కాల్స్ వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సర్దార్ పటేల్ విద్యాలయానికి కూడా బాంబు బెదింపు సందేశాలు వచ్చినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు వెంటనే సంబంధిత పాఠశాలలకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అప్పటికే స్కూల్‌కు వచ్చిన విద్యార్థులను పాఠశాల గేట్లకు బయటకు పంపించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సెయింట్ థామస్ స్కూల్కు బాంబు బెదిరింపు రావడం ఇది రెండోసారి.
పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తర్వాత మరొక పాఠశాల, ఒక కాలేజీకి కూడా బెదిరింపులు వచ్చాయి. పిల్లలు భయంతో ఉన్నారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని నాలుగు ఇంజిన్ల ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి’ అని కేజ్రీవాల్ విమర్శించారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విరేంద్ర సచ్దేవా ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలల నుంచి విమానయాన సంస్థలకు ఇటువంటి ఈమెయిల్ బెదిరింపులు ఆందోళన కలిగించే విషయం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ పార్టీలు అయిన ఇలాంటి అంశాలపై రాజకీయాలు చేయవు. బదులుగా అవి భద్రతా సంస్థలతో సహకరిస్తాయి. కానీ మన దేశంలో అరవింద్ కేజ్రీవాల్ వంటి తక్కువ స్థాయి నాయకులు ఇలాంటి సున్నితమైన అంశాలపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.
More Stories
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి