పాక్ ద్రోణులు ఎలాంటి నష్టం కలిగించలేదు

పాక్ ద్రోణులు ఎలాంటి నష్టం కలిగించలేదు

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లును ఉపయోగించినా భారత డిఫెన్స్ వ్యవస్థకు అవి ఎలాంటి నష్టాన్ని కలిగించలేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. పాక్ ఉపయోగించిన ఆ డ్రోన్లను చాలావరకు స్వదేశీ టెక్నాలజీతో నిర్మూలించామని చెప్పారు. ప్రస్తుతం డ్రోన్లు ఒక మిలిటరీ సాధనంగా మారాయని వివరించారు.  పాకిస్థాన్ డ్రోన్ల‌ను, డ్రోన్ ఆయుధాల‌లో ఏ ఒక్క‌టి కూడా భార‌తీయ సైనిక లేదా పౌర కేంద్రాల‌ను దాడి చేయ‌లేక‌పోయిన‌ట్లు ఆయన గుర్తు చేశారు.

నిన్నటి ఆయుధ వ్యవస్థలతో నేటి యుద్ధాన్ని గెలవలేమని, నేటి యుద్ధాన్ని రేపటి సాంకేతికతోనే పోరాడాలని తెలిపారు. ఢిల్లీలో జరిగిన యుఎవి & సి-యూఏఎస్ దేశీకరణపై జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ “ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని ఉపయోగించింది. వాటిలో ఏదీ కూడా భారత్ సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలపై ఎటువంటి నష్టం కలిగించలేదు” అని తెలిపారు. 

“చాలా వరకు కైనిటిక్‌, నాన్ కైన‌టిక్ ప‌ద్ద‌తుల్లో ఆ డ్రోన్ల‌ను కూల్చివేశాం. కొన్ని డ్రోన్ల‌ను రిక‌వ‌రీ చేశాం. ఇక డ్రోన్ల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యుద్ధంలో పరిణామాత్మక మార్పును తీసుకువస్తున్నాయా? లేదా? అని ఆలోచించాల్సి వస్తుంది” అని సూచించారు. పాక్ డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ప్రయోగించిన కొన్ని డ్రోన్‌లు దాదాపు చెక్కుచెదరకుండా తిరిగి లభించాయని చెబుతూ ఇది భారతదేశ రక్షణ సామర్థ్యానికి, వ్యూహాత్మక సంసిద్ధతకు నిదర్శనం అని వెల్లడించారు. 

“డ్రోన్ల వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధి ఓ పరిణామాత్మక ప్రక్రియ కాగా, వాటి వినియోగం మాత్రం యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. డ్రోన్ల వినియోగ సామర్థ్యం పెరిగినా కొద్దీ, భారత్ సైన్యం వాటిని విప్లవాత్మకంగా ఉపయోగించడం ప్రారంభించాయి. ఇటీవల కాలంలో జ‌రుగుతున్న యుద్ధాల్లో డ్రోన్ల ప‌నితీరును ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం” అని చౌహాన్ వివరించారు.

“దేశీయంగా అభివృద్ధి చేసిన కౌంటర్-యూఏఎస్ వ్యస్థలు ఎందుకు కీలకమో ఆపేరషన్ సిందూర్ మనకు స్పష్టం చేసింది. మనల్ని మనం రక్షించుకోవడానికి స్వదేశీ సామర్థ్యాల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వాటిని నిర్మించుకోవాలి. రక్షణ, దాడి లక్ష్యాల కోసం కీలకంగా మారిన ఈ వ్యవస్థల విషయంలో మనం పూర్తిగా విదేశీ సాంకేతికతపై ఆధారపడలేం” అని స్పష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో స్పష్టంగా తెలిసిందని పేర్కొంటూ వాటిపై ఆధారపడితే అది మన సన్నద్ధతను బలహీనపరుస్తుందని చౌహన్ తెలిపారు. ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, అలాగే అవసరమైనప్పుడు విడిభాగాల కొరతకు దారితీస్తుందని చెప్పారు. అంతేకాకుండా, విదేశీ సామర్థ్యం గురించి అందరికీ తెలుసని, దీంతో ప్రత్యర్థులు ఈ వ్యవస్థల సామర్థ్యం ఆధారంగా మన వ్యూహాలను అంచనా వేయగలరని సీడీఎస్ చౌహాన్ తెలిపారు.
 
తాము తమ సొంత శాటిలైట్ వనరులతో సమర్థవంతంగా ఉగ్రశిబిరాలపై దాడులు చేశామని పేర్కొంటూ ఈ సమయంలో దాయాది దేశం చైనా, ఇతర దేశాల శాటిలైట్ చిత్రాలపై ఆధార పడిందని గుర్తు చేశారు. అలాగే భారత్ ఎప్పుడూ దీర్ఘకాల యుద్ధాలను కోరుకోదని చెబుతూనే దాని వల్ల దేశాభివృద్ధి మందగిస్తుందని చెప్పారు. అంతేకాకుండా రక్షణ రంగంలో ఆటోమేషన్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.