ఓటర్ల జాబితాపై కాగ్ తో థర్డ్ పార్టీ ఆడిట్ కోరిన టిడిపి

ఓటర్ల జాబితాపై కాగ్ తో థర్డ్ పార్టీ ఆడిట్ కోరిన టిడిపి
 
టిడిపి పార్లమెంటరీ బృందం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలిసి ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఓటర్ల జాబితాల సవరణ కోసం  ప్రతీ ఏటా ఓటర్ల జాబితాలపై కాగ్ తో ధర్డ్ పార్టీ ఆడిట్ జరిపించాలని కోరింది.  ఏఐ సాయంతో నకిలీ, వలసదారుల, చనిపోయిన వారి ఓట్లు రియల్ టైమ్ లో తొలగించాలని,  ఆధార్ సాయంతో డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరింది.
 
పౌరసత్వ ధ్రువీకరణతో ముడిపెట్టి ఓటర్ల జాబితా సవరణ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ (టిడిపి) కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే సవరణలు ఉండాలని సూచించింది. ఈ విషయంలో ప్రస్తుతం బీహార్‌లో చేపడుతున్న తరహాలో దేశవ్యాప్తంగా చేయతలపెట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు విధానపరమైన స్పష్టత ఉండాలని కోరింది. 
 
ఎస్‌ఐఆర్‌ అనేది పౌరసత్వ ధ్రువీకరణకు సంబంధించిన ప్రక్రియ కాదనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో స్పష్టంగా తెలియజేయాలని సూచించింది. ఎస్‌ఐఆర్‌ ఉద్దేశమేంటో స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని, సవరణలకు స్పష్టమైన నిర్వచనం, ఈ ప్రక్రియను మార్పులు, చేర్పులకే పరిమితం చేయాలని విన్నవించింది. అలాగే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలని కూడా టిడిపి కోరింది. 
 
ఎన్నికల జాబితా విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని, ఈ ప్రక్రియలన్నీ పూర్తి పారదర్శకంగా చేపట్టాలని కోరింది. న్యూఢిల్లీలోని నిర్వచన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ (ఇసిఐ) జ్ఞానేష్‌ కుమార్‌తో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కూడిన నేతల బృందం మంగళవారం సమావేశమైంది. పల్లాతో పాటు ఎంపిలు లావు శ్రీకృష్ణదేవరాయులు, డి ప్రసాదరావు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కూన రవికుమార్‌, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్స్న పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా నాలుగు పేజీల లేఖను ఇసిఐకి టిడిపి బృందం అందజేసింది. ఎన్నికల జాబితా నిర్వహణను బలోపేతం చేయడం, ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ప్రస్తుతం బీహార్ లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం రెండు నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ ప్రారంభించింది.
అయితే ఇందులో భారీగా ఓ వర్గం ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  సుప్రీంకోర్టు కూడా దీనిపై జోక్యం చేసుకుని ఈసీకి పలు సూచనలు చేసింది. 
ఈ నేపథ్యంలో జాతీయ స్ధాయిలో ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఈసీ వెబ్ సైట్ లో జిల్లాల వారీగా ఓటర్ల మార్పులు చేర్పుల వివరాలు, వాటి కారణాలను అప్ లోడ్ చేయాలని కోరింది. అలాగే ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని రియల్ టైమ్ లో పరిష్కరించడానికి డ్యాష్ బోర్డులు నిర్వహించాలని కూడా కోరింది. 
 
ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియలో తప్పుచేస్తే బాధ్యుల్ని చేసేలా చర్యలు ఉండాలని తెలిపింది. స్థానికంగా పక్షపాతం చూపకుండా బూత్ లెవెల్ ఎన్నికల అధికారుల రొటేషన్ చేయాలని కోరింది. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం ఓ అంబుడ్స్ మెన్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరింది. నివాసం లేని వారు, వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కూడా కోరింది. 
 
వీరి కోసం నామమాత్రపు ఆధారాలతో అయినా తాత్కాలిక అడ్రస్ ఇచ్చేలా చూడాలని కోరింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నెలకోసారి ఓటర్ల జాబితాలపై సమీక్ష నిర్వహించాలని కూడా సూచించింది. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల సవరణకు తగిన సమయం ఇవ్వాలని, ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మళ్లీ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా చూడాలని కోరింది. 
 
సమగ్ర విచారణ లేకుండా ఓట్లను తొలగించకూడదని, ఓటరు గుర్తింపు ఆధారాల్ని తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండాలని, ఓటర్లపై కాదని తెలిపింది. అలాగే సవరణ పరిధి తెలియాలని, మొబైల్ బీఎల్వో యూనిట్లు ఏర్పాటు చేసి వలస కార్మికులకు తాత్కాలికంగా అయినా ఓటు హక్కు కల్పించాలని, ఓట్ల తొలగింపుకు సమగ్ర విచారణ చేయాలని కోరింది.