మోదీకి 100 కిలోల మామిడితో యూనస్ దౌత్యం

మోదీకి 100 కిలోల మామిడితో యూనస్ దౌత్యం

షేక్ హసీనా సర్కారు కూలిన తర్వాత బంగ్లాదేశ్‌‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడాన్ని బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఓ వైపు భారత్‌తో వైరుధ్యాలను కొనసాగిస్తూనే, మరోవైపు మామిడి దౌత్యానికి మహ్మద్ యూనుస్ సర్కారు తెరతీసింది.  అయితే, భారత ప్రధాని మోదీ కూడా ఈ ఏడాది యూనుస్‌కు ఈదుల్ అధా శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

షేక్ హసీనా బాటలో పయనిస్తూ ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1000 కేజీల హరీభంగా రకం మామిడి పండ్లను పంపింది. అవి ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయానికి చేరుకున్నాయని సమాచారం.  ఒకటి, రెండు రోజుల్లోగా ఆ మామిడి పండ్లను భారత ప్రధానమంత్రి కార్యాలయం, భారత దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారులకు పంపించనున్నారు. 

గత గురువారం రోజే సరిహద్దు రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాకు 300 కేజీల హరీభంగా మామిడిని బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనుస్ సర్కారు పంపినట్లు తెలిసింది.  మరో సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా విడిగా మామిడి పండ్లను పంపుతారని సమాచారం. వాస్తవానికి ఈ సంప్రదాయాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనానే ప్రారంభించారు. 

అప్పట్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉండేవి. విశ్వసనీయ మిత్రదేశంగా బంగ్లాదేశ్‌ను భారత్ పరిగణించేది. దీంతో ఆనాడు భారత ప్రధానికి, సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు హసీనా పంపిన హరీభంగా మామిడి పండ్లకు ఒక అర్థం ఉండేది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.  హసీనా సహా దేశం విడిచి పారిపోయిన ప్రముఖ రాజకీయ నేతలు అందరినీ స్వదేశానికి తీసుకొచ్చి, తమ ఎదుట హాజరుపర్చాలని బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసిటి) ఆదేశాలు జారీ చేసింది. 

మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలు లక్ష్యంగా కొన్ని నెలల పాటు ఇస్లామిక్ అతివాదులు దాడులకు తెగబడ్డారు. మహ్మద్ యూనుస్ తాత్కాలిక సర్కారులోనూ ఇస్లామిక్ అతివాదులకే ప్రాధాన్యత దక్కింది. ఈనేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్  సదస్సు వేదికగా తొలిసారిగా మహ్మద్ యూనుస్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆసందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను మోదీ ఖండించారు. 

వెంటనే ఆ దాడులను ఆపాలని పిలుపివ్వడంతో పాటు  వీలైనంత త్వరగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మారాలని యూనుస్‌కు హితవు పలికారు. షేక్ హసీనా తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంపై భారత్‌కు ఏర్పడిన అసహనాన్ని అద్దం పట్టేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని పరిశీలకులుభావిస్తున్నారు.  ఎన్నికల నిర్వహణ విషయంలో మహ్మద్ యూనుస్ నాన్చివేత ధోరణిని అవలంభిస్తున్నారు.

దేశంలోని ఇంకొన్ని రంగాల్లో సంస్కరణలు చేయాల్సి ఉందని, ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహిస్తానని బుకాయిస్తున్నారు. 2026 ఏప్రిల్ నెల రెండోవారంలోగా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన అంటున్నారు.  షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అణచివేతను ఎదుర్కొంటున్న వేళ ఓ కొత్త పార్టీ ఏర్పాటైంది. దాని పేరు నేషనల్ సిటిజెన్ పార్టీ (ఎన్‌సీపీ). దీనితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ), ఇతర పార్టీలన్నీ వీలైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించాలని యూనుస్ సర్కారును డిమాండ్ చేస్తున్నాయి. 

హిందువులపై దాడులను ఆపడం, ఇస్లామిక్ అతివాద శక్తులను నిలువరించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అనే మూడు అంశాలను బంగ్లాదేశ్ నుంచి భారత్ కోరుకుంటోంది. ఇవేం చేయకుండా తియ్యటి మామిడి పండ్లను పంపి భారత్‌ను బుట్టలో వేసుకోవడం కుదరదని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులుస్పష్టం చేస్తున్నారు.

గత సంవత్సరం ఆగస్టులో మహ్మద్ యూనుస్ భారత్‌తో బంగ్లాదేశ్‌కు ఇప్పటికీ బలమైన సంబంధాలు ఉన్నాయని, ఎప్పటికీ ఇరుదేశాల మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పరం ఆధారపడుతూ, సహకరించుకుంటూ పురోగమిస్తున్నాయని ఆయన చెప్పారు. చారిత్రకంగా, రాజకీయంగా, ఆర్థికంగా భారత్, బంగ్లాదేశ్‌ ఎంతో సన్నిహితమైనవని, తమ ప్రభుత్వం సైతం అదేబాటలో పయనిస్తుందని స్పష్టం చేశారు.