జన్యుమార్పిడివిత్తనాలు తీసుకోవాలని ట్రంప్ వత్తిడి!

జన్యుమార్పిడివిత్తనాలు తీసుకోవాలని ట్రంప్ వత్తిడి!

జన్యుమార్పిడి (జెనిటిక్‌ మాడిఫైడ్‌ (జిఎం)) విత్తనాలను భారత్‌ తీసుకోవాల్సిందేనని టారిఫ్‌ చర్చల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే భారత వ్యవసాయరంగం పెను ప్రమాదంలో పడుతుందని, రైతుల మెడపై కత్తిపెట్టడమేనన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. 

మంగళవారం నుండి టారిఫ్‌లపై సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రంప్‌ ఒత్తిళ్లపై ఎటువంటి వైఖరి తీసుకుంటారు? అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందన్న అంశాలు కీలకంగా మారాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, పోలాండ్‌, హంగరీ, భూటాన్‌, టర్కీ, సౌదీ అరెబియాతో పాటు అనేక యూరప్‌ దేశాలు జిఎం పంటల సాగు, దిగుమతులను నిషేధించాయి. 

ఆహార భద్రత, పర్యావరణ రక్షణ అంశాలను ఆ దేశాలు ఈ నిషేధానికి కారణంగా చూపాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక వాణిజ్య ఒప్పందం పేరిట జరుగుతున్న చర్చల ప్రక్రియలో అమెరికా జిఎం విత్తనాల అంశాన్ని ముందుకు తేనుందని సమాచారం. బహుళజాతి కంపెనీలు మనదేశంలో ఉన్న విస్తారమైన మార్కెటింగ్‌ అవకాశాలపై కన్ను వేయడమే దీనికి కారణమని చెబుతున్నారు.

పేరుకి వ్యవసాయం సహా ఫార్మాస్యూటికల్‌, ఆటోమొబైల్స్‌, స్టీల్‌ రంగాల సుంకాలపై చర్చలని చెబుతున్నప్పటికీ భారత వ్యవసాయరంగంపైనే అమెరికా దృష్టి కేంద్రీకరించి ఉందని, దానిలో భాగంగానే మొక్కజొన్న, సోయాబీన్‌, గోధుమలు లాంటి జిఎం విత్తనాలను, పంటలను కూడా అనుమతించాలని అమెరికా పట్టుబడుతోంది. ఇప్పటి వరకు ఈ తరహా పంటలను నియంత్రించడంలో భాగంగా జన్యు ఇంజనీరింగ్‌ మూల్యాంకన కమిటీ (జిఇఎసి) కఠినమైన నిబంధనను అమలు చేస్తోంది.

భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం భారత వాణిజ్య మంత్వ్రి శాఖ బృందం సోమవారం వాషింగ్టన్‌ చేరుకుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాల గడువు ఆగస్టు 1 సమీపి స్తోండటంతో టారిఫ్‌లపై స్పష్టత కోసం నాలుగు రోజుల పాటు ఈ సంప్రదింపులు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, సుంకాలు, వాణిజ్య అడ్డంకులపై చర్చించడం ఈ సమావేశాల లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.

భారత్‌ ఈ చర్చల్లో పూర్తిస్థాయి ద్వైపాకిక్ష వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. ఆగస్టు 1 నాటికి తొలి విడత డీల్‌ను కుదుర్చుకోవాలని, ఆ తర్వాత కూడా చర్చలను కొనసాగించి పూర్తిస్థాయి ఒప్పందానికి రావాలని ప్రయత్నిస్తోంది. భారత్‌ వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు టారీఫ్‌లలో రాయితీలు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. మరోవైపు 26 శాతం టారిఫ్‌లను అమెరికా తొలగించాలని బలంగా కోరుతోంది. అలాగే స్టీల్‌పై 50 శాతం, ఆటో సెక్టార్‌పై 25 శాతం పన్ను తొలగించాలని కోరుతోంది.