జల వివాదాలపై తెలుగు సీఎంలతో రేపే కేంద్రం భేటీ!

జల వివాదాలపై తెలుగు సీఎంలతో రేపే కేంద్రం భేటీ!

తెలుగు రాష్ట్రాల్లోని జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు డిల్లీలోని శ్రాంశక్తిభవన్‌ వేదికగా నిర్వహించనున్న సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఈ భేటీకి వచ్చేందుకు వీలవుతుందా? లేదా? అనేది తెలియజేయాలని కోరింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం, బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా16, 17 తేదీల్లో డిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

దానితో వీరిద్దరూ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది.  చర్చించాల్సిన జల అంశాలకు చెందిన అజెండా వివరాలను కూడా ముందుగానే తమ మంత్రిత్వశాఖకు పంపాలని కూడా కేంద్రం సూచించింది.  ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.

పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌‌కు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు.

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందిస్తుందని వివరించారు. 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పడుతుందని, 9.14 లక్షల హెక్టార్లకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. 20 టీఎంసీలు నీరు పరిశ్రమలకు అందించగలుగుతామని సీఎం చంద్రబాబు అప్పుడు పేర్కొన్నారు. 

ఆ తర్వాత పోలవరం- బానకచర్ల అనుసంధానం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు, నేతలకు సూచించారు. ఈ  ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు,  తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. 

తెలంగాణాలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. పోలవరం-బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని, ప్రజలకు వాస్తవాలు వివరిద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కూడా బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఏపీతో చర్చలు జరుపుతామని పేర్కొన్న తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరగనున్న సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.