షేక్‌ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన డబ్ల్యుహెచ్ఓ

షేక్‌ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన డబ్ల్యుహెచ్ఓ
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సెలవుపై పంపింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సైమా వాజెద్‌పై అవినీతి కేసులు నమోదుచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.  షేక్‌ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్.. సైమాపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ తదితర అభియోగాలు మోపింది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. సైమా వాజెద్‌ను సెలవుపై పంపించి ఆమె స్థానంలో డాక్టర్ కేథరినా బోహ్మేకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది.
సైమాను బాధ్యతల నుంచి తొలగించారా అన్న మీడియా ప్రశ్నకు.. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని మాత్రమే డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్‌ కార్యాలయం ఢిల్లీలో ఉంది. అక్కడే విధులు నిర్వహించే సైమా వాజెద్‌ ప్రస్తుతం సెలవుపై వెళ్లారు. కాగా రిజర్వేషన్‌లకు సంబంధించి విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో షేక్‌ హసీనా అనూహ్య రీతిలో ప్రధాని పదవిని కోల్పోయారు.
దాంతో గత ఏడాది ఆగస్టు 5 నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వం హసీనాపై హత్య సహా పలు అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైమా వాజెద్‌ను సెలవుపై పంపడం హసీనాకు షాక్‌ అనే చెప్పవచ్చు.
డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న చర్యపై స్పందిస్తూ, బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం “మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సైమా వాజెద్‌ను నిరవధిక సెలవుపై ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. జవాబుదారీతనం వైపు ఇది ఒక ముఖ్యమైన మొదటి అడుగుగా మేము భావిస్తున్నాము” అని పేర్కొన్నారు.
 
“శ్రీమతి వాజెద్‌ను ఆమె పదవి నుండి తొలగించే, అనుబంధిత హక్కులన్నింటినీ రద్దు చేసే, ఈ ప్రతిష్టాత్మక పాత్రకు సమగ్రతను, మొత్తం ఐరాస వ్యవస్థ  విశ్వసనీయతను పునరుద్ధరించే శాశ్వత పరిష్కారం అవసరమని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము” అని కూడా ఆయన తెలిపారు. “బంగ్లాదేశ్ ప్రజలు ,ప్రపంచ ప్రజలు పారదర్శకత, నిజాయితీ, న్యాయం ఆవిర్భవించడాన్ని చూసి సంతోషంగా ఉన్నారు” అని కూడా ఆయన చెప్పారు.