నాటి అందాల న‌టి స‌రోజా దేవి కన్నుమూత‌

నాటి అందాల న‌టి స‌రోజా దేవి కన్నుమూత‌

కోట శ్రీనివాస రావు మ‌ర‌ణ వార్త మ‌రిచిపోక ముందే చిత్ర పరిశ్రమలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి వ‌యోభారంతో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్యంలో వ‌చ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు, యశవంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమెకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలోనే(87) సోమవారం కన్నుమూశారు. 

ఆమె మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. స‌రోజా దేవి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లో క‌లిపి మొత్తం 200ల‌కి పైగా సినిమాల‌లో న‌టించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎమ్జీఆర్ వంటి హీరోల‌తో క‌లిసి న‌టించింది. 

1938 జ‌న‌వ‌రి 7, బెంగ‌ళూరులో జ‌న్మించిన స‌రోజా దేవి తొలి సారి క‌న్న‌డ భాష‌లో మ‌హాక‌వి కావి కాళిదాస అనే చిత్రం చేసింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. ఇందులో ఆమె స‌పోర్టింగ్ రోల్ పోషించింది. ఇక తెలుగులో ఎన్టీఆర్‌తో క‌లిసి పాండురంగ మ‌హ‌త్యం( 1957) సినిమా చేయ‌గా, ఇది ఆమె తొలి తెలుగు సినిమా. క‌ళామ్మ‌త‌ల్లికి ఆమె చేసిన సేవ‌ల‌కి గాను కేంద్ర ప్ర‌భుత్వం ఆమెకి 1969లో ప‌ద్మ శ్రీ అవార్డ్ అందించింది. 1992లో ప‌ద్మ భూష‌ణ్‌తో సత్క‌రించింది. ఇక త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌లైమామ‌ణి అవార్డ్ ఇచ్చింది.

2009లో ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డ్, నాట్య క‌ళాధ‌ర అవార్డులు కూడా అందుకున్నారు. 2007లో రోట‌రీ శివాజీ అవార్డ్, ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్, ప‌లు సౌత్ అవ‌ర్డ్స్ కూడా ద‌క్కించుకుంది. ఇక 1998,2005లో 45వ‌, 53వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల జ్యూరీ అధ్య‌క్షురాల‌గా కూడా వ్య‌వ‌హ‌రించింది.  స‌రోజా దేవి తండ్రి బైర‌ప్ప కూతురిని ల‌లిత క‌ళ‌ల్లో పెక్కువ‌గా ప్రోత్స‌హించారు. తండ్రి కోరిక మేర‌కు నాట్యం కూడా అభ్య‌సించారు. వై జ‌యంతిమాల పోలిక‌లు ఆమెలో ఉండ‌డంతో వారిద్ద‌రిని చాలా మంది అక్కా చెల్లెళ్లు అనుకునేవారు. ఎన్టీఆర్‌తో క‌లిసి పెళ్లి కానుక‌, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, ర‌హ‌స్యం, అమ‌ర‌శిల్పి జ‌క్క‌న్న వంటి చిత్రాలు చేసింది. 

రామారావుతో క‌లిసి జ‌గ‌దేక వీరుని క‌థ‌, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు దాగుడు మూత‌లు, ప్ర‌మీలార్జునీయం, శకుంత‌ల‌, భాగ్య చ‌క్రం, ఉమాచ‌డీ గౌరీ శంక‌రుల క‌థ‌, విజ‌యం మ‌న‌దే, మాయ‌ని మ‌మ‌త‌, మ‌నుషుల్లో దేవుడ‌, శ్రీరామాంజ‌నేయ యుద్ధం, దాన వీర శూర‌క‌ర్ణ చిత్రాల‌లో నటించింది. ఎన్టీఆర్ డైరెక్ష‌న్‌లో రూపొందిన తొలి చిత్రం సీతారామ క‌ళ్యాణంలో న‌టించిన స‌రోజా దేవి ఆయ‌న చివ‌రి సారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌మ్రాట్ అశోక్‌లోను న‌టించింది.

1985లో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరుసటి సంవత్సరం 1986లో ఆయన చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఓ సంవత్సరం పాటు కుటుంబసభ్యుల్ని తప్ప వేరే వాళ్లను కలవను కూడా లేదు.

1987లో మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. లేడీస్ హాస్టల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భర్త మరణం తర్వాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. భర్త మరణానికి ముందు సైన్ చేసిన సినిమాలు పూర్తి చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, నిర్మాతలు, ఫ్యాన్స్ బలవంతం చేయటంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019లో ‘నటసార్వభౌమ’ అనే కన్నడ సినిమాలో చివరగా నటించారు.