బీరుట్లో హిజ్బుల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేసినట్లే ఇరాన్ అధ్యక్షుడిని హత్య చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జిసి)కి సంబంధించిన వార్తా సంస్థ పేర్కొంది. జూన్ 16న టెహరాన్లోని ఓ భవనంలో నిర్వహించిన ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్, న్యాయవ్యవస్థ చీఫ్ మొహ్సేని ఎజి, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారని వార్తాసంస్థ తెలిపింది.
వారంతా సమావేశంలో ఉన్న సమయంలో ఆ భవనంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడిందని వార్తాసంస్థ వెల్లడించింది. వారు తప్పించుకునే వీలు లేకుండా భవనానికి ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను లక్ష్యంగా చేసుకొని ఆరు క్షిపణులను ప్రయోగించిందని విమర్శించింది. దాడులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ నాయకులు, అధికారులు ముందుగానే సిద్ధం చేసుకున్న అత్యవసర హాచ్ ద్వారా తప్పించుకోగలిగారని తెలిపింది.
అక్కడి నుంచి తప్పించుకుంటున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సహా పలువురు ఉన్నతాధికారులకు గాయాలైనట్టు తెలిపింది. హిజ్బుల్లా నాయకుడు నస్రల్లాను హత్య చేయడానికి ఇజ్రాయిల్ ఇదే తరహాలో దాడి చేసిందని, అయితే ఇరాన్ అధ్యక్షుడి విషయంలో విఫలమైందని పేర్కొంది. గత నెల 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో తనను చంపేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నించినట్లు ఓ ఇంటర్వ్యూలో ఇరాన్ అధ్యక్షుడు సహితం తెలిపారు.
“నాపై జరిగిన హత్యాయత్నం వెనుక అమెరికా లేదు. అది ఇజ్రాయెల్. నేను ఒక సమావేశంలో ఉన్నాను… మేము ఆ సమావేశం నిర్వహిస్తున్న ప్రాంతంపై బాంబు దాడి చేయడానికి వారు ప్రయత్నించారు,” అని పర్షియన్ భాషలో చేసిన వ్యాఖ్యల అనువాదం ప్రకారం, ఇటీవలి యుద్ధంలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రస్తావిస్తూ ఆయన పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థ ప్రకారం, సంఘర్షణ సమయంలో ఇరాన్లో 900 మందికి పైగా మరణించారు.
నెతన్యాహు మధ్యప్రాచ్యంలో “శాశ్వత యుద్ధాలు” అనే తన “సొంత ఎజెండా”ను అనుసరిస్తున్నారని పెజెష్కియన్ ఆరోపించారు. అమెరికాను దానిలోకి లాగవద్దని ఆయన కోరారు. “అమెరికా యుద్ధం కాని, నెతన్యాహు యుద్ధంలో పాల్గొనకుండా అమెరికా పరిపాలన దూరంగా ఉండాలి” అని ఆయన హితవు చెప్పారు. రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి స్థాపించగలిగితే, అణు చర్చలను తిరిగి ప్రారంభించడంలో తన దేశానికి “ఎటువంటి సమస్య” లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, చర్చలను తిరిగి ప్రారంభించడానికి ఒక షరతు ఉందని చెబుతూ “మేము మళ్ళీ చర్చలలోకి ప్రవేశించాలంటే చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మళ్ళీ మాపై దాడి చేయడానికి అనుమతి ఇవ్వరని మనం ఎలా ఖచ్చితంగా తెలుసుకోవాలి” అని ఆయన ప్రశ్నించారు.

More Stories
గాజాలో పొంచి ఉన్న తీవ్ర పౌష్టికాహార సంక్షోభం.. ఐరాస
సిరియాపై దాడి యుద్ధం కాదు.. ప్రతీకారమే !
బంగ్లాదేశ్లో హిందూవును పోలీసుల సంరక్షణలోనే కొట్టి చంపారా?