బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్య

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి దారుణ హత్య
బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. ఒక హిందూ వ్యాపారిపై కొందరు వ్యక్తులు దాడి చేసి కాంక్రీట్ స్లాబ్‌తో కొట్టి చంపారు. చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత అతడి మృతదేహంపై నృత్యం చేశారు. ఈ సంఘటనపై బంగ్లాదేశ్‌లోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 9న ఓల్డ్ ఢాకా ప్రాంతంలోని మిట్‌ఫోర్డ్ హాస్పిటల్ ముందు ఈ సంఘటన జరిగింది. 
 
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) యూత్ ఫ్రంట్‌కు చెందిన కార్యకర్తలు హిందువైన స్క్రాప్ డీలర్ లాల్ చంద్ సోహాగ్‌పై దాడి చేశారు. కాంక్రీట్ స్లాబ్‌తో మోది అతడ్ని హత్య చేశారు. మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత సోహాగ్‌ మృతదేహంపై నృత్యం చేశారు. ఈ వీడియో క్లిప్‌ గురువారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
 
43 ఏళ్ల తుక్కు వ్యాపారి సోహాగ్‌పై జరిగిన దాడి ఆ ప్రాంత శాంతిభద్రతలపై పెద్ద ప్రశ్నలను తేలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా భయాన్ని సృష్టించింది. , సోహాగ్ ‘సోహనా మెటల్’ అనే సంస్థను విజయవంతంగా నడుపుతున్నాడు. అయితే కొంతకాలంగా ఆయనకు వ్యాపార ప్రత్యర్థులైన మహ్మదుల్ హసన్ మొహిన్, హొసైన్ టిటు నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. వారు వ్యాపారంలో 50 శాతం వాటా లేదా నెలసరి డబ్బులు డిమాండ్ చేశారట. సోహాగ్ ఇవన్నీ ఖండించడంతో కక్ష పెరిగిందట.

కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పలు యూనివర్సిటీల్లోని హిందూ విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం మూక హింసను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.

మరోవైపు లాల్ చంద్ సోదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 19 మందిని నిందితులుగా, సుమారు 20 మంది గుర్తు తెలియని వారిని అనుమానితులుగా పేర్కొన్నారు. లాల్‌ చంద్‌ హత్యకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశారు. కాగా, ఈ సంఘటనపై బీఎన్‌పీ స్పందిస్తూ  లాల్ చంద్ సోహాగ్‌ను కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు పేర్కొంది.

తాత్కాలిక ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పత్రికా స్వేచ్ఛను అణచివేయడం, జర్నలిస్టులపై దాడులకు దారి తీయడం వంటి ఘటనలతో విమర్శలు ఎదుర్కొంటోంది. మైనారిటీలపై దాడులు, ఆలయాల ధ్వంసం, రాజకీయ హింస ఆ ప్రభుత్వ పాలనపై ఆరోపణలకు దారితీస్తున్నాయి. ఢాకాలో చోటుచేసుకున్న ఈ హత్య దేశంలో చట్టం ఉనికిపై ప్రశ్నలు వేస్తోంది. ఎన్నికలపై స్పష్టత లేకపోవడం, ప్రజల ఆవేదనను మరింత పెంచుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో శాంతిని నెలకొల్పేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.