
ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఆకర్షితురాలైన ఓ రష్యన్ మహిళ ఇద్దరు చిన్నారులతో మారుమూల గుహలో జీవిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లా కుంట తాలూకా రామతీర్ధ కొండల్లోని మారుమూల గుహలో ఆమె జీవిస్తున్న వైనం వెలుగుచూసింది. దట్టమైన అడవులు, లోతైన మలుపులతో కూడిన ఈ సహజ గుహలో రెండు వారాలుగా ఆమె జీవనం సాగిస్తోంది.
అక్కడే రుద్ర విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తోంది. గుహ ప్రాంతం సమీపంలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో జూలై 9న పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ పోలీసులు రామతీర్థ కొండ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ పెట్రోలింగ్ బృందం రామతీర్ధ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఒక గుహ బయట దుస్తులు ఉండడాన్ని గమనించారు.
దీంతో వారు పైకి వెళ్లి చూడగా గుహలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. రష్యాకు చెందిన ఆ మహిళను 40 ఏళ్ల నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. ఆమెతో పాటు ఆరేళ్ల కుమార్తె ప్రేయ, నాలుగేళ్ల అమా ఉన్నారు. వన్యమృగాలు, విషసర్పాలు ఉండే ఇక్కడి క్లిష్ట వాతావరణంలో ఎలా జీవనం సాగించారు? ఏమి తిన్నారో తెలియక పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బిజినెస్ వీసా మీద రష్యా మహిళ ఇక్కడకు వచ్చిందని, అది 2017లోనే గడువు తీరిందని పోలీసు అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఇంత కాలం ఆమె ఎక్కడ ఉందనేది తెలియనప్పటికీ హిందుత్వం పట్ల ఆకర్షితురాలై గోవా నుంచి గోకర్ణకు వచ్చినప్పుడు ఆక్కడి పర్వత ప్రాంతంలోని ప్రదేశాన్ని చూసి ముగ్దురాలైనట్లు భావిస్తున్నారు. అయితే పోలీసులు ఆమెను ఒప్పించి గుహ నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు.
ఆమెను ప్రశ్నించగా గోవా నుంచి ఇక్కడకు చేరుకుని గుహలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలిపింది. పాస్‌పోర్ట్, వీసా పత్రాలు ఆ గుహలో ఎక్కడో పోయినట్లు చెప్పింది. అయితే ఆ ప్రాంతం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. రష్యా మహిళ అభ్యర్థన మేరకు బంకికోడ్ల గ్రామంలోని మహిళా సన్యాసి యోగరత్న సరస్వతి ఆశ్రమానికి తొలుత వారిని తరలించారు.
మరోవైపు గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి ఆ గుహలో సోదా చేయగా రష్యా మహిళ పాస్‌పోర్ట్, వీసా పత్రాలు లభించాయి. 2017 ఏప్రిల్ 17 వరకు గడువు ఉన్న బిజినెస్ వీసాపై నీనా భారత్‌కు వచ్చినట్లు వాటి ద్వారా తెలిసింది. 2018 ఏప్రిల్ 19న గోవాలోని విదేశీ కార్యాయలం భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆమెకు చెప్పింది.
దీంతో నేపాల్ వెళ్లిన రష్యా మహిళ అదే ఏడాది సెప్టెంబర్ 8న తిరిగి భారత్‌కు వచ్చినట్లు ఆమె రికార్డుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. కాగా, వీసా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో రష్యా మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలను కార్వార్‌లోని మహిళా రిసెప్షన్ సెంటర్‌కు పోలీసులు తరలించారు. వారిని రష్యాకు తిరిగి పంపేందుకు బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఉత్తర కన్నడ పోలీస్ అధికారి వెల్లడించారు.
More Stories
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం
అరబ్-ఇస్లామిక్ నాటో… ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి
అస్సాంలో ముస్లింలకు హిందువుల భూముల బదిలీల్లో అవినీతి!