ఏఏఐబీ నివేదిక లీక్‌పై పైలట్ల అభ్యంతరం

ఏఏఐబీ నివేదిక లీక్‌పై పైలట్ల అభ్యంతరం
జూన్‌ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్‌ ఇండియా ఏఐ 171 విమాన ప్రమాదం ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏ ఎల్ పి ఎ-ఐ) ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తు తీరును చూస్తే తప్పు పైలట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందంటూ తీవ్రంగా స్పందించింది. ఈ భావనను పూర్తిగా తిరస్కరిస్తున్నామని, నిష్పాక్షిక, వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది.
ఏఏఐబీ ప్రాథమిక నివేదిక మీడియా లీక్‌ కావడంపై విమర్శలు గుప్పించింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికను ఏ బాధ్యతాయుతమైన అధికారి సంతకం, విచక్షణ లేకుండానే మీడియాతో షేర్‌ చేశారంటూ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. దర్యాప్తు పూర్తిగా గోప్యంగా జరిగిందని, ఇది విశ్వసనీయతను ప్రభావితం చేసిందని, ప్రజలు సైతం దీన్ని పూర్తిగా నమ్మడం లేదని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన సిబ్బంది, ముఖ్యంగా పైలట్‌లను ఇప్పటికీ దర్యాప్తు బృందంలో చేర్చడం లేదని పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో జులై 10న వచ్చిన కథనం ఇంధన నియంత్రణ స్విచ్‌లో లోపాన్ని ప్రస్తావించిందని ప్రకటనలో ఆరోపించింది. ఈ ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి సున్నితమైన దర్యాప్తు సమాచారం అంతర్జాతీయ మీడియాకు ఎలా లీక్ అయిందనే ప్రశ్నించింది. 
 
పైలట్ల తప్పును చూపేలా దర్యాప్తు ఉందన పేర్కొంటూ ఈ ధోరణిని స్పష్టంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. నిష్పాక్షికమైన, వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని, జవాబుదారీతనం నిర్ధారించడానికి దర్యాప్తు ప్రక్రియలో కనీసం పరిశీలకులుగా చేర్చాలని అసోసియేషన్‌ పునరుద్ఘాటించింది. దర్యాప్తులో కనీసం పరిశీలకులుగానైనా పైలట్లకు అవకాశమిస్తే దర్యాప్తులో పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. 
ఈ డిమాండ్‌పై ఎయిరిండియా స్పందించింది. ఏఏఐబీ నివేదికపై సమీక్షించేందుకు పైలట్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సంస్థ ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ఉప్పల్‌ ప్రకటించారు.

పాశ్చాత్య మీడియా తీరు దారుణం: బీజేపీ

మరోవంక, బోయింగ్‌ 787 విమానంలో లోపమేమీ లేదని, పైలట్‌ ఇంజన్‌కు ఇంధన సరఫరా ఆపేయడంతోనే ప్రమాదం జరిగిందని పాశ్చాత్య మీడియా ప్రచా రం చేయడం దారుణమని బీజేపీ మండిపడింది. దీనిపై ఆ పార్టీ నేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఏఏఐబీ నివేదికలోని ఒక అంశాన్ని పట్టుకుని పాశ్చాత్య మీడియా వార్తలు ప్రచురిస్తున్న తీరు అగౌరవకరం. మరణించిన పైలట్లపై అపనిందలు వేస్తున్న తీరు దారుణం’’ అని పేర్కొన్నారు.