
తరచూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ ఓవైపు, ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా అని కాచుక్కూర్చున్న చైనా మరోవైపు- ఈ రెండింటినీ దీటుగా ఎదుర్కొనేలా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై భారత వాయుసేన దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు చెందిన లోరా (లాంగ్ రేంజ్ ఆర్టిలరీ) సూపర్ సోనిక్ క్షిపణులను అమ్ములపొదిలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
యుద్ధ సమయాల్లో విభిన్నమైన అవ సరాలకు వినియోగించుకునేలా, మన వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణులకు తోడుగా లోరా క్షిపణులను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ)లోరా క్షిపణులను అభివృద్ధి చేసింది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులకు ఉండే లక్షణాలు దీని సొంతం. గంటకు 6వేల కిలోమీటర్ల (మాక్ 5)కుపైగా వేగంతో దూసుకుపోయి 430 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఒకసారి లక్ష్యాన్ని నిర్ధారిస్తే జీపీఎస్, ఐఎన్ఎస్ నావిగేషన్ సాయంతో దూసుకుపోతుంది. క్షిపణి దూసుకెళ్తున్న సమయంలో దాడి చేయాల్సిన లక్ష్యాన్ని మార్చేందుకు వీలుంటుంది. దీనితో శత్రు దేశాలు ఈ క్షిపణులను మధ్యలోనే కూల్చేయడం కష్టతరం అవుతుంది. ఈ క్షిపణుల్లో జామ్ చేయడానికి వీల్లేని సాంకేతికత ఉంది. నిర్ణీత లక్ష్యంపై పది మీటర్లలోపు తేడాతో దాడి చేయగలదు.
5.2 మీటర్ల పొడవు, 1,600 కిలోల బరువు ఉండే ‘లోరా’ క్షిపణికి 570 కిలోల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు. బ్రహ్మోస్ క్షిపణుల బరువు చాలా ఎక్కువ. సరిహద్దులకు కాస్త దగ్గర్లోని భారీ లక్ష్యాలను ఛేదించడానికి అవి అనుకూలం. లోరా క్షిపణులు మరింత లోపలి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించేందుకు ఉపయోగపడతాయి. మన వాయుసేన వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలకు ‘లోరా’ క్షిపణులను చాలా సులువుగా అనుసంధానం చేయవచ్చు.
ఒక్కో సుఖోయ్ ఫైటర్ 4 లోరాలను మోసుకెళ్లగలదు. అంటే ఒక ఫైటర్ వెళ్లి.. ఒకేసారి శత్రువు ఎయిర్‌బేస్‌లోని రన్‌వేను, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయవచ్చు. బ్రహ్మోస్ ఒక్కో క్షిపణి ఖరీదు సుమారు రూ.34 కోట్లు కాగా, లోరా క్షిపణుల ఖరీదు సుమారు రూ.21 కోట్లు. బ్రహ్మోస్ అత్యంత తక్కువ ఎత్తులో రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్తుంది. సాధారణ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించేందుకు అనుకూలం.
లోరా క్షిపణులు ఎత్తయిన, పర్వత ప్రాంతాల్లోని లక్ష్యాలను సమర్థవంతంగా ధ్వంసం చేసేందుకు వీలు కల్పిస్తాయి. లోరా క్షిపణులను మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు ఐఏఐ, భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్ మధ్య 2023లోనే అవగాహన ఒప్పందం కుదిరింది. సాంకేతిక బదిలీ, ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే 2026-27నాటికి లోరా క్షిపణులు వాయుసేన అమ్ములపొదిలోకి చేరనున్నాయి.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా