మయన్మార్ బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడిలో 23 మంది మృతి

మయన్మార్ బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడిలో 23 మంది మృతి

మయన్మార్ లోని సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలోని బౌద్ధ ఆశ్రమంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది మరణించారు. మరో 30 మంది గాయపడగా, వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.  సాగింగ్ టౌన్‌షిప్‌లోని లిన్ టా లు గ్రామంలోని ఒక ఆశ్రమ భవనంపై తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జెట్ ఫైటర్ బాంబు దాడి చేసింది.

ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 23 మంది పౌరులు మరణించారు. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన మండలేకు వాయువ్యంగా 35 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. అయితే ఆశ్రమంపై జరిగిన దాడిపై సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మయన్మార్‌లో ఆంగ్‌ సాన్‌ సూచీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో కూలదోసి అధికార పగ్గాలు చేపట్టింది సైన్యం. నాటి నుంచి ఆ దేశం రాజకీయ కల్లోలాలతో అంతర్యుద్ధం సాగుతుంది.

శాంతియుత ప్రదర్శనలను అణచివేయడంతో సైనిక పాలనను వ్యతిరేకించే చాలా మంది ఆయుధాలను అందుకున్నారు. దీంతో ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణలు నెలకొన్నాయి. ముఖ్యంగా అల్పసంఖ్యాకులు నివసించే సరిహద్దు ప్రాంతాలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సాయుధ ప్రతిఘటనకు బలమైన కోటగా సాగింగ్ ఉంది. ఈ ప్రాంతంలో సాయుధ దళాలను ఎదుర్కోవడానికి సైన్యం వైమానిక దాడులను ఎక్కువగా ఉపయోగించింది. 

ఈ క్రమంలోనే సమీపం ప్రాంతంలోని గ్రామాలాకు చెందిన 150 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుగుబాటుదారుల వద్ద ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. మయన్మార్‌లో ఎంఎన్‌డీఏఏ, అరకాన్‌ ఆర్మీ, టీఎన్‌ఎల్‌ఏ గ్రూపులు అక్కడి సైనిక ప్రభుత్వంపై 2023 చివరి నుంచి పోరాటం చేస్తున్నాయి.

 వీటిని త్రీ బ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ అని పిలుస్తుంటారు. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రఖైన్‌ ప్రాంతంలో మయన్మార్‌ సైన్యాన్ని అరకాన్‌ ఆర్మీ ఎదుర్కొంటుండగా, చిన్‌లో పోరాడుతున్న చిన్‌ బ్రదర్‌హుడ్‌ అలయన్స్‌(సీబీఏ)కి అరకాన్‌ ఆర్మీ మద్దతు ఇస్తోంది. ఇక చైనా సరిహద్దులోని షాన్‌ ప్రాంతంలో టీఎన్‌ఎల్‌ఏ, ఎంఎన్‌డీఏఏలు పోరాడుతున్నాయి. ఇప్పటికే భారత్‌-బంగ్లా సరిహద్దులోని రఖైన్‌ ప్రాంతమంతా ఇప్పుడు అరకాన్‌ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోగా, చిన్‌లో 85శాతాన్ని సీబీఏ అదుపులోకి తీసుకోంది.