ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి

రక్షణ శాఖ భూముల బదలాయింపు పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కీలక అడుగు పడింది. ఈ కారిడార్ నిర్మాణ పనులకు సంబంధించి  కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ విక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలతో పాటు సికింద్రాబాద్, కంటోన్మెంట్, హకీంపేట ప్రాంతాల్లో మొత్తం 168 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయింపు చేస్తున్నామని , అందులో భాగంగా సరిసమానమైన భూమితో పాటు పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని పేర్కొంటూ రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కంటోన్మెంట్ బోర్డు, డిఆర్‌డిఓ, ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, డిఈఓలకు చెందిన డిఫెన్స్ భూములు దాదాపుగా 168 ఎకరాల భూములను ప్రభుత్వానికి బదలాయింపు చేసినందుకు జవహర్‌నగర్‌లోని 330 ఎకరాల హెచ్‌ఎండిఏ భూమిని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద రక్షణశాఖకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివిధ సర్వే నెంబర్లలో ఉన్న 113 ఎకరాల రక్షణ శాఖ భూమికి సరి సమానమైన పరిహారం కింద రూ.803 కోట్ల విలువైన భూ బదలాయింపుతో పాటు రూ.151కోట్ల నగదు చెల్లింపునకు హెచ్‌ఎండిఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 

దీంతో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు (సుమారు 18.124 కి.మీల) మేర నిర్మించనున్న కారి డార్‌కు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైవే 44లో, జాతీయ రహదారి 44లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం 55 ఎకరాల డిఫెన్స్ భూమిని కేటాయించారు. ఇందుకోసం ఆయా భూముల కోసం హెచ్‌ఎండిఏ పరిహారంగా రూ.748కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

కాగా, రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు బదులుగా వచ్చిన రూ. 303 కోట్లను  రక్షణ శాఖ కన్సాలిడేటెడ్ ఫండ్ కు జమ చేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ కంటోన్మెంట్ బోర్డుకే ఈ డబ్బు జమచేయాలని బోర్డు తీర్మానం చేసి లేఖ రాసింది. దానితో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తాను కూడా లేఖలు వ్రాయడమే కాకుండా, ఈ విషయమై పార్లమెంట్ లో తాను ప్రస్తావించానని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

శామీర్ పేట ఎలివేటెడ్ కారిడార్ తో పాటు డబుల్ డెక్కర్ బ్రిడ్జి కట్టి మెట్రో, రోడ్డు ఉండేలా చూడాలని కూడా కోరడంతో కేంద్ర రక్షణ శాఖ 303 కోట్లు బోర్డు ఖాతాలోనే జమచేసినట్టు ఉత్తర్వులు జారీ చేసిందని రాజేందర్ తెలిపారు. దీనితో పాటు 11 కోట్ల రూపాయల గ్రాంట్ కూడా అందించిందని చెప్పారు.  మరోవంక, రూ  160 కోట్లతో.. రెండు స్టామ్ వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుండి ప్యాట్నీ వరకు, రెండవది రసూల్ పూర బస్తీల మీదుగా మంజూరు చేశారని ఆయన తెలిపారు.

ఎస్ఎన్ డిపి మాదిరిగా వీటిని నిర్మాణం చేయబోతున్నారని, వీటితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం అందనుందని రాజేందర్ తెలిపారు. 
రూ. 128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేయబోతున్నామని వెల్లడించారు. కంటోన్మెంట్ లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వరద కాలువలు నిర్మాణం చేయబోతున్నామని,  డబుల్ బెడ్ రూమ్ లు కూడా నిర్మించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.