‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను దసో ఏవియేషన్ సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియెర్ తోసిపుచ్చారు. భారత్ ఇప్పటి వరకు ఒక రాఫెల్‌నే కోల్పోయిందని, అది కూడా ఎత్తైన ప్రాంతంలో సాంకేతిక లోపం తలెత్తడం కారణంగానే జరిగిందని, యుద్ధంలో కాదని స్పష్టత ఇచ్చారు.
అధిక ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక వైఫల్యం కారణంగా రఫేల్ యుద్ధ విమానం కూలిపోయిందని వెల్లడించారు. శత్రు దాడులు, రాడార్ వల్ల రఫేల్‌ను భారత్ నష్టపోలేదని స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో 12,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో రఫేల్ ఉండగా, ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. భారత్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానంపై ఎటువంటి శత్రుదాడి జరగలేదని తెలిపారు.
ఇటీవలే భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణల్లో ఇండియా రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయినట్లు భారత ప్రభుత్వం కానీ, ఐఏఎఫ్ కానీ అధికారికంగా ఎప్పుడూ ధ్రువీకరించలేదు. అయితే ఇదే విషయంపై గత నెలలో(జూన్) సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణల్లో ఐఏఎఫ్ కొన్ని నష్టాలను చవిచూసిందని అంగీకరించారు. ఎన్ని యుద్ధ విమానాలకు నష్టం వాటిల్లిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ భారత్‌కు చెందిన రఫేల్ సహా 6 విమానాలను కూల్చివేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. అది ‘పూర్తిగా అవాస్తవం’ అని తెలిపారు. భారత దళాలు అనేక సందర్భాల్లో పాక్ గగనతలంలోకి ప్రవేశించాయని స్పష్టం చేశారు.
ఫ్రాన్స్‌లో తయారైన ప్రతిష్ఠాత్మక రఫేల్ యుద్ధ విమానాల విషయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల అనంతరం రఫేల్ పనితీరుపై సందేహాలు వ్యాప్తి చేసేందుకు డ్రాగన్ యత్నిస్తోందని గుర్తించారు ఫ్రాన్స్ సైనిక, నిఘా విభాగం అధికారులు. రఫేల్ ఖ్యాతిని, విక్రయాలను దెబ్బతీసేందుకు చైనా యత్నిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకోసం చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగించుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.
చైనా దౌత్య కార్యాలయాల్లోని రక్షణశాఖ అధికారులు యుద్ధక్షేత్రంలో రఫేల్‌లు పేలవంగా పనిచేశాయని చెబుతూ వాటి అమ్మకాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఫ్రెంచ్ నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆర్డర్ చేసిన దేశాలకు మరిన్ని రఫేల్‌లు కొనుగోలు చేయొద్దని, ఆసక్తి చూపుతున్న ఇతర దేశాలకు చైనా తయారీ యుద్ధవిమానాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నాయి.

More Stories
త్వరలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం .. ట్రంప్
ప్రపంచ శాంతికి భారత్- జపాన్ సంబంధాలు కీలకం
చైనాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అర్హతలు