యూకే, చైనాలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, భారత్‌తోనూ త్వరలోనే డీల్ జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు తాను విధించిన 90 రోజుల గడువు జులై 9తో ముగియనున్నందున 14 దేశాలకు తొలి విడతగా సోమవారమే లేఖలను పంపామని ట్రంప్ వెల్లడించారు. ఆ దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామని ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు.
ఆయా దేశాలు అమెరికాకు పంపే వస్తువులు, ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలను విధిస్తామని, ఈ అంశాన్ని వారికి పంపిన లేఖల్లోనూ ప్రస్తావించామని తెలిపారు. ఈ జాబితాలో బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్, ఇండోనేషియా, జపాన్, బోస్నియా అండ్ హెర్జ్‌గొవీనా, కాంబోడియా, కజకిస్తాన్, లావోస్ పీపుల్స్ డెమొక్రటిక్ రిపబ్లిక్, మలేషియా, సెర్బియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ట్యునీషియా ఉన్నాయని చెప్పారు.
ఒకవేళ ఈ దేశాలు అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించినా, ఇప్పటికే ఉన్న సుంకాలను పెంచినా తీవ్ర పర్యవసానాలు ఉంటాయని లేఖల్లో ట్రంప్ హెచ్చరించారు. ఆయా దేశాలు వాటి వాణిజ్య విధానాలను మార్చుకునేందుకు సిద్ధమైతే మాత్రం, సుంకాలను కొంతమేర తగ్గించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ట్రేడ్ డీల్‌పై చర్చలకు అంగీకరించే దేశాలతో తాము అన్యాయంగా వ్యవహరించమని, సముచిత స్థాయిలోనే సుంకాలను ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కొన్ని దేశాలు గతంలో అమెరికా సరుకులపై 200 శాతం దాకా సుంకాలను విధించేవని, అలాంటి దేశాలతో వ్యాపారం చేయడం ఆనాడు కష్టసాధ్యంగా ఉండేదని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోకి కంపెనీలు, నిపుణులు ప్రవేశించే అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు.
14 దేశాలకు పంపిన లేఖల్లోని సమాచారం ప్రకారం ఆగస్టు 1 నుంచి మయన్మార్, లావోస్‌ల సరుకులపై అమెరికా అత్యధికంగా 40 శాతం పన్ను విధించనుంది. థాయ్‌లాండ్, కాంబోడియాలపై 36 శాతం, బంగ్లాదేశ్, సెర్బియాలపై 35 శాతం, ఇండోనేషియాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జ్గొవీనాలపై 30 శాతం, మలేషియా, కజకిస్తాన్, ట్యునీషియాలపై 25 శాతం చొప్పున పన్నులు విధించనుంది.

More Stories
విద్యార్థుల కోసం ‘జెన్-జెడ్’ పోస్టాఫీస్‌లు
అమెరికా ఆంక్షలతో చమురు అమ్మకాలు ఆపేసిన రిలయన్స్
అనిల్ అంబానీ రూ. 1,400 కోట్ల ఆస్తుల జప్తు