తెలంగాణాలో ఖేలో ఇండియా గేమ్స్- 2026, ఒలింపిక్స్

తెలంగాణాలో ఖేలో ఇండియా గేమ్స్- 2026, ఒలింపిక్స్
‘ఖేలో ఇండియా గేమ్స్- 2026’ను తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవీయకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియాతో పాటు జాతీయ క్రీడలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని సిఎం కోరారు.  కేంద్ర మంత్రి మన్సుఖ్ ఎల్.మాండవీయను ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి సోమవారం కలిశారు.
ఖేలో ఇండియా కింద క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, క్రీడాకారుల శిక్షణ, క్రీడా నిపుణులఎంపిక ఇతర కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. భువనగిరిలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, రాయగిరిలో స్విమ్మింగ్ పూల్, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మల్టీపర్పస్ హాల్, హైదరాబాద్ హకీంపేట్‌లో అర్చరీ రేంజ్, సింథటిక్ హాకీ ఫీల్డ్, ఎల్‌బి స్టేడియంలో స్క్వాష్ కోర్టు, నేచురల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అభివృద్ది, సింథటిక్ ట్రాక్, గచ్చిబౌలిలో హాకీ గ్రౌండ్ నవీకరణ, నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వసతుల మెరుగుకు అన్నివిధాలా కృషి చేస్తోందని కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సిఎం కోరారు. 2036లో దేశంలో నిర్వహించే ఒలింపిక్స్‌లో కనీసం రెండు ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రికి సిఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణాల్లో ఛార్జీ రాయితీ ఇవ్వాలని సిఎం కోరారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఆయన అధికారిక నివాసంలో కపిల్ దేవ్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు వివరించారు. 
 
యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామిని అవుతానని కపిల్‌దేవ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శిం చిన క్రీడా యూనివర్సిటీలు అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.