ఆపరేషన్ సిందూర్ తో రక్షణ ఉత్పత్తులకు డిమాండ్

ఆపరేషన్ సిందూర్ తో రక్షణ ఉత్పత్తులకు డిమాండ్

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయ రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 2.7ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని పేర్కొంటూ భారత్ కోసం ఓ పెద్ద మార్కెట్ ఎదురుచూస్తోందని తెలిపారు. సోమవారం డీఆర్డీఓ భవనంలో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నిర్వహించిన కంట్రోలర్స్ కాన్ఫరెన్స్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. 

“ప్రపంచం ఇప్పుడు మన రక్షణ రంగం వైపు చూస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, అలాగే మన దేశీయ పరికరాల సామర్థ్యాన్ని ప్రదర్శించిన తీరు వల్ల ఇక్కడి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ప్రపంచంలోని కొన్ని దేశాల జీపీడీ కంటే భారత్ రక్షణ బడ్జెట్ ఎక్కువ. ప్రజలు కష్టపడి సంపాదించిన ఆదాయంలో గణనీయమైన భాగాన్ని రక్షణ మంత్రిత్వ శాఖకు కేటాయించినప్పుడు దానిని సమర్ధవంతంగా వినియోగించే బాధ్యత కూడా పెరుగుతుంది” అని తెలిపారు. 

“రక్షణ వ్యయం పెరగడం ఒక్కటే కాదు. దాన్ని సరైన లక్ష్యాల కోసం, సరైన సమయంలో, సమర్థంగా వినియోగించాల్సిన అవసరం ఉంది” అని రాజనాథ్ సింగ్ చెప్పారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన గవర్నమెంట్ ఈ-మార్కెట్ప్లేస్ పోర్టల్ నుంచి రక్షణ ఉత్పత్తుల కొనగోళ్లకు అనుమతి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. 

“ఈ నిర్ణయం వల్ల పారదర్శకత, సమర్థత పెరుగుతుంది. అంతేకాదు సమగ్ర వేతన వ్యవస్థ, డేటాబేస్ నిర్వహణపై కూడా ఈ విభాగం పని చేస్తోందని తెలిసింది. ఇక శాంతంగా ఉన్నామంటే అది కేవలం ఒక భ్రమ మాత్రమే అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మనం ప్రశాంతంగా ఉన్న సమయాల్లో కూడా అనిశ్చితికి సిద్ధంగా ఉండాలి. ఆకస్మిక మార్పులు మన ఆర్థిక, కార్యచరణ పరిస్థితులను మారుస్తాయి” అని రక్షణ మంత్రి తెలిపారు. 

“పరికరాల ఉత్పత్తిని పెంచడమే కాదు. ఆర్థిక విధానాల్లోనూ మార్పులు తీసుకురావాలి. నూతన సాంకేతికతకలతో ఎప్పటికప్పుడు వినూత్న పద్దతుల్లో స్పందించగలిగేలా సిద్ధంగా ఉండాలి’ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.  జులై 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ కంట్రోలర్స్ కాన్ఫరెన్స్ను డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎస్జీ. దస్తీదార్, డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ మయాంక్ శర్మ పాల్గొన్నారు.