‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో కాంగ్రెస్ కు బ్రిటన్ ఆర్మీ సాయం

‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో కాంగ్రెస్ కు బ్రిటన్ ఆర్మీ సాయం

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో బ్రిటిష్ ఆర్మీ సాయం తీసుకోవడంతోపాటు కాంగ్రెస్ బ్రిందన్వాలెను పెంచి పోషించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. సిక్కు జాతికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. సిక్కులకు జరిగిన అన్యాయాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మూడు అన్యాయాలను చేసిందని గుర్తు చేస్తూ అప్పటి అధికారులు రాసిన లేఖలను దూబే పోస్ట్ చేశారు.

“1947లో కర్తార్పుర్ సాహెబ్ను పాకిస్థాన్కు అప్పగించారు. ఆ సమయంలో యావత్ సిక్కు జాతి ఆందోళనలు చేపట్టింది. 1984లో సిక్కు వేర్పాటువాదం పెరిగినప్పుడు బ్రిందన్వాలాను రంగంలోకి దింపారు. జైల్ సింగ్ను రాష్ట్రపతిని చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ ఆర్మీ సాయంతో స్వర్ణ దేవాలయంపై దాడి చేశారు. అనంతరం ఇందిరా గాంధీ హత్యతో సిక్కు అల్లర్లు చెలరేగాయి” అని గుర్తు చేశారు. 

“ఈ సందర్భంగా అనేక మంది సిక్కులను ముఖ్యంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు హత్య చేయించారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేయగానే మరో సిక్కు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేశారు. ఇలా అనేక సార్లు సిక్కులను కాంగ్రెస్ బొమ్మలుగా వాడుకుంటుంది” అంటూ దూబే ధ్వజమెత్తారు.  ‘1984లో బ్రిటన్ సహకారంతో స్వర్ణ దేవాలయంపై ఇందిరా గాంధీ దాడి చేయించారు. ఆ సమయంలో అనేక మంది బ్రిటన్ అధికారులు అమృత్ సర్లోనే ఉన్నారు. బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలో హోంశాఖకు లేఖ రాసింది. ఆర్మీతో పాటు సాంకేతిక సాయంతో చేయాలని కోరినట్లు ఇందులో స్పష్టంగా ఉంది” అని ఆయన వెల్లడించారు. 

“దీంతో బ్రిటిష్ సైన్యం అక్కడికి వెళ్లింది. స్వర్ణ దేవాలయంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ 6 నెలలుగా ప్రణాళికలు రచించింది. దీనికి బ్రిటిష్ సైన్యం నాయకత్వం వహించగా, భారత ఆర్మీ పాల్గొన్నట్లు దర్యాప్తు సమయంలో తేలింది. బ్రిందన్వాలెను పెంచి పోషించింది మీరే. ఆ తర్వాత బ్రిటిష్ సైన్యం సాయంతో సిక్కుల అత్యున్నత ప్రార్థన మందిరమైన స్వర్ణ దేవాలయంపైనా దాడి చేశార” అని దూబే పేర్కొన్నారు.

మరోవైపు హిందీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో జరుగుతున్న ఆందోళనపైనా దూబే స్పందించారు. హిందీ మాట్లాడే వారిపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 

“మహారాష్ట్రలో హిందీ మాట్లాడే వారిపై దాడులు చేస్తున్న వారు తమిళ్,తెలుగు, ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేయగలరా? మీకు నిజంగా దమ్ము ఉంటే మహారాష్ట్రలో ఉంటూ ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేస్తారా? నిజంగా ధైర్యం ఉంటే మహీమ్ దర్గా వద్దకు వెళ్లి హిందీ, ఉర్దూ మాట్లాడే వారిపై దాడులు చేయాలి. సొంత ఇంట్లో ఉన్నప్పుడు కుక్క కూడా సింహం లాగా అనుకుంటుంది. ” అని దూబే ఘాటుగా స్పందించారు.