దలైలామా వారసుడిపై చైనా వితండవాదం

* వైభవంగా దలైలామా పుట్టినరోజు

టిబెటన్‌ బౌద్ధ గురువు దలైలామాకు తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను నిర్ణయించే అధికారం లేదంటూ బీజింగ్‌ మరోసారి వితండవాదం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. టిబెట్‌ బౌద్ధ గురువు పునర్జన్మ విధానాన్ని ఆయన నిర్ణయించకూడదని పేర్కొన్నారు. 
 
టిబెటన్ బౌద్ధమతంలో ‘లివింగ్ బుద్ధాల’ పునర్జన్మ అనేది 700 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఒక చారిత్రక, మతపరమైన సంప్రదాయమని జు ఫెయిహాంగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా ? అని నిర్ణయించే అధికారం 14వ దలైలామాకు లేదంటూ చెప్పుకొచ్చారు.  చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారమే పునర్జన్మ ప్రక్రియ జరగాలని చైనా విదేశాంగ శాఖ కూడా గతంలోనే తేల్చి చెప్పిందని తెలిపారు. 
 
టిబెటిన్‌ బౌద్ధంలో ఓ ప్రత్యేకమైన విధానంలో వారసుడి ఎంపిక జరుగుతుందని, లివింగ్‌ బుద్ధ విధానంలో దాదాపు 700 సంవత్సరాలుగా పునర్జన్మ విధానం కొనసాగుతోందని పేర్కొంటూ ప్రస్తుతం చైనాలోని జిజాంగ్‌, టిబెట్‌, సిచువాన్‌, యునాన్‌, గన్సు, క్వింగ్‌హాయ్‌ ప్రావిన్స్‌ల్లో దాదాపు వెయ్యి రకాల పునర్జన్మ విధానాలను అనుసరిస్తున్నారని వివరించారు. 
 
సుదీర్ఘ చారిత్రక సంప్రదాయానికి 14వ దలైలామా ఓ భాగమని,  అంతకంటే ఎక్కువ కాదని, ఆ సంప్రదాయాలు ఆయనతోనే మొదలు కాలేదని, ఆయనతోనే అంతం కావని స్పష్టం చేశారు. దలైలామా వారసుడి ఎంపికపై భారత్‌ తన వైఖరిని ప్రకటించిన తర్వాత చైనా రాయబారి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 2న కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ ఆచారాలను కొనసాగించే హక్కు దలైలామాకు ఉందని స్పష్టం చేశారు.
దలైలామా పునర్జన్మ పూర్తిగా మతపరమైన అంశమని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు కేవలం ఆయనకు, బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావు లేదని చెప్పడం ద్వారా  చైనా చేస్తున్న వాదనలను తిప్పికొట్టిన్నట్లయింది.  ఆదివారం  దలైలామా 90వ పుట్టిన రోజు కాగా, ఇదే రోజున ఈ అంశాన్ని చైనా తెరపైకి తీసుకువచ్చింది. అంతకుముందు దలైలామ ఎంపికకు తమ ఆమోదముద్ర తప్పనిసరి అని చైనా చెప్పుకొచ్చింది.
కాగా, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా వేలాది మంది ప్రజలు బౌద్ధుల ఆధ్మాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన ఉత్సవానికి హాజరయ్యారు. ధర్మశాలలో దలైలామా ఆలయంగా పిలుచుకునే సుగ్లఖాంగ్‌ ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. అయితే దలైలామా వారసునిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రజలు తనపై చూపుతున్న ప్రేమే మానవులందరికీ సేవ చేసే స్ఫూర్తిని తనకు కలుగచేస్తోందని దలైలామా చెప్పారు.