వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే

వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే

దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్‌ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్‌ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదని పేర్కొంది.  ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజుజు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

“దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది” అని ఆ  ప్రకటనలో పేర్కొన్నారు.  దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు సంస్థ మాత్రమే చేస్తుందని పేర్కొన్నారు. 

దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనదని రిజిజు పేర్కొన్నారు. టిబెటన్ సంప్రదాయంలో, ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక పిల్లల శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. దలైలామా వెబ్‌సైట్ ప్రకారం జూలై 6, 1935న ప్రస్తుత క్వింఘై ప్రావిన్స్‌లోని ఒక రైతు కుటుంబంలో లామో ధోండప్‌గా జన్మించిన 14వ దలైలామా. రెండేళ్ల వయసులో అలాంటి పునర్జన్మలలో ఒకరని గుర్తించారు.

దలైలామా అనే పదాన్నే పరిశీలిస్తే, ఇందులోని ‘దలై’ అనేది మంగోలియా భాష పదం. దీని అర్థం మహా సముద్రం. ‘లామా’ అనేది టిబెటన్ భాషా పదం. దీనర్థం గురువు. ‘దలైలామా’ అంటే ‘మహా జ్ఞాన సముద్రం’ అనే అర్థం వస్తుంది. 1959లో కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించుకున్న తర్వాత టిబెటన్ల పెద్ద సమూహంతో కలిసి భారత్‌ను ఆశ్రయించి దలైలామా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

దలైలామా అప్పటి నుంచి ధర్మశాలను తన నివాసంగా చేసుకున్నారు. ఇది బీజింగ్‌కు మింగుడుపడని అంశంగా మారింది.  ఆయన ఉనికి చైనా, భారత్‌ మధ్య వివాదంగా మిగిలిపోయింది. టిబెటన్ స్వయంప్రతిపత్తి కోసం పోరాటం ఆయన వారసుడు సైతం కొనసాగించాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.