కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు దుమారం

కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు దుమారం
 
* డీకే శివకుమార్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు?
కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పు ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై డీకే శివకుమార్‌, సీఎం సిద్ధరామయ్య ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉండేవిధంగా ముందే ఏర్పాటు జరిగిందని ప్రచారం జరుగుతున్న  క్రమంలో అక్టోబర్‌లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. 
ఈ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి, ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా కర్ణాటక పర్యటనకు రావడం, పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం రావడంతో నాయకత్వం మార్పు కోసమే అనే ప్రచారం జరిగింది. అయితే నాయకత్వం మార్పు గురించి తాను అభిప్రాయాలు సేకరించడం లేదని, కేవలం తమ నియోజకవర్గాలలో చేస్తున్న పనుల గురించి తెలుసుకొనేందుకు ఎమ్యెల్యేలు, ఎంపీలతో సమావేశం అవుతున్నట్లు తెలిపారు.
 
ఈ గందరగోళం వేళ ఉప ముఖ్యమంత్రి డీకేకి సన్నిహితుడిగా పేరొందిన ఓ ఎమ్మెల్యే రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ‘మార్పు’ కోరుకుంటున్నట్లు చెప్పడం పార్టీలో కలకలం రేపుతున్నది. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.  ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ “నేను ఒక్కడిని కాదు. మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారు. 100 మందికిపైగా ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారు. వారిలో చాలా మంది మార్పు కోసం ఎదరుచూస్తున్నారు. మంచి పాలన కోరుకుంటున్నారు” అంటూ పార్టీలో దుమారం లేపారు. 

“సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్‌ను సీఎంని చేయాలి. ఆయన పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి అందరూ చూశారు. అందుకే మోజారిటీ ప్రజలు ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశం గురించి నేను సుర్జేవాలాతో మాట్లాడతాను” అంటూ స్పష్టం చేశారు. 

పైగా, ఇప్పుడు మార్పు జరగకపోతే 2028లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారాన్ని నిలుపుకోలేదని ఖరాఖండిగా చెప్పారు.  ప్రస్తుతం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీఎం మార్పు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు. అయితే, అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని పేర్కొంటూఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు.

“హైకమాండ్‌ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ విషయాన్ని హైకమాండ్‌కే వదిలిపెట్టాము. తదుపరి కార్యాచరణను తీసుకునే అధికారం దానికే ఉంది. అనవసరంగా సమస్యను సృష్టించవద్దు” అని కోరారు.  కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ ఎద్దేవా చేసింది.  ప్రతిపక్ష నాయకుడు ఆర్‌ అశోకా స్పందిస్తూ ఖర్గే కాకపోతే పార్టీ హైకమాండ్‌ ఎవరని ప్రశ్నంచారు. మీరు కాకపోతే రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలలో ఎవరో ఒకరా లేక ఓ ఇంటిపేరుతో కూడిన కనిపించని కమిటీనా అని ఎక్స్‌లో ఆయన ఖర్గేని ప్రశ్నించారు.

మరోవంక, ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహితం ఈ విషయమై స్పష్టత ఇవ్వడం కోసం తనకు, ఉపముఖ్యమంత్రికి మధ్య ఎటువంటి అగాధం లేదని, పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. హోంమంత్రి హెచ్ కె పటేల్ సహితం సూర్జేవాలా పర్యటన నాయకత్వం మార్పు గురించి కాదని చెప్పుకొచ్చారు.  దానితో  ప్రభుత్వంలో ఎలాంటి నాయకత్వ మార్పు ఉండబోదని డీకే శివకుమార్ సహితం చెప్పారు. తాను నాయకత్వ మార్పును కోరుకోవడం లేదని, ముఖ్యమంత్రి పదవి కోసం తనకు ఏ ఎమ్మెల్యే మద్దతు అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ దృష్టంతా స్థానిక సంస్థల ఎన్నికలు, 2028లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉందని చెప్పుకొచ్చారు.

.