
పాశమైలారం ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా, 17 మంది తప్పిపోయారని,ఇంకా మరికొంతమంది ఆచూకీ లభించడం లేదని చెప్పారు. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని, ప్రమాదం అనంతరం 53 మంది ఆచూకీ తెలిసిందని సీఎం పేర్కొన్నారు.
ఇంకా కొంతమంది శిథిలాల కింద ఉన్నారా? లేక భయంతో ఎక్కడికైనా వెళ్ళిపోయారా? అన్నది తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు అధికారులతో కమిటీ వేశామని చెబుతూ కమిటీ నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని వెల్లడించారు. ఇలాంటివి జరగకుండా పరిశ్రమలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరిశ్రమల్లో తరచూ తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఖర్చుతో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేల తక్షణ సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడి పని చేసుకోలేని వారికి రూ.10 లక్షల పరిహారం, గాయపడి చికిత్స తర్వాత పని చేసుకోగలిగిన వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించనున్నారు. బాధితుల పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తామని మాటిచ్చారు.
ప్రమాద కారణాలను ఊహాజనితంగా చెప్పవద్దని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలో పనిచేసే కార్మికుల నైపుణ్యం గురించి అడిగారు. నైపుణ్యం ఉన్నవారు, లేనివారి వివరాలు ఇవ్వాలని కోరారు. మంత్రులు వివేక్, రాజనర్సింహతో సమన్వయం చేసుకోవాలని అక్కడున్న కంపెనీ ప్రతినిధికి సీఎం సూచించారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా పరిశ్రమ యాజమాన్యం రాకపోవడంపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. ప్రమాద ఘటనను కార్మిక, వైద్యారోగ్య శాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత