అమెరికా దాడుల్లో ఇరాన్‌ మెటల్‌ మార్పిడి కేంద్రం ధ్వంసం

అమెరికా దాడుల్లో ఇరాన్‌ మెటల్‌ మార్పిడి కేంద్రం ధ్వంసం

అమెరికా దాడుల్లో ఇరాన్‌ ఏకైక మెటల్‌ మార్పిడి కేంద్రాన్ని ధ్వంసం చేశాయని సిఐఎ డైరెక్టర్‌ జాన్ రాట్క్లిఫ్ అమెరికా చట్టసభ సభ్యులతో పేర్కొన్నారు. ఈ దాడిలో ఇరాన్‌ అణు కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని, అధిగమించడానికి సంవత్సరాలు పడుతుందని చెప్పారని పేరు చెప్పేందుకు నిరాకరించిన అమెరికా అధికారి ఒకరు తెలిపారు. గతవారం అమెరికా చట్టసభ సభ్యులతో జరిగిన రహస్య విచారణ సందర్భంగా రాట్‌క్లిఫ్‌ మెటల్‌ మార్పిడి కేంద్రంపై దాడుల గురించి వివరించారని చెప్పారు.

గత మంగళవారం కాల్పుల విరమణకు ముందుజరిగిన దాడులతో ఇరాన్‌కు జరిగిన నష్టంపై డెమోక్రటిక్‌ చట్టసభ సభ్యులు, ఇతరులు అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన యంత్రాంగం సమాధానం ఇచ్చిన సమయంలో ఈ రహస్య సమాచారం గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడైంది.  12రోజుల దాడిలో ఇరాన్‌ వైమానిక రక్షణ వ్యవస్థ దెబ్బతిందని సిఐఎ డైరెక్టర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో చట్టసభ సభ్యులకు స్పష్టం చేశారు.

దీంతో ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు చేసే ఏ ప్రయత్నాన్నైనా ఇజ్రాయిల్‌ దాడులతో సులభంగా అడ్డుకోవచ్చని, వాటిని ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఇరాన్‌కు చాలా తక్కువ శక్తి ఉందని చెప్పుకొచ్చారు.ఇరాన్‌ నిల్వ చేసిన యురేనియంలో అధిక భాగం ఇస్పహాన్‌, ఫోర్డో వద్ద శిథిలాల కింద దగ్ధమై ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయని రాట్‌క్లిఫ్‌ చట్టసభ సభ్యులకు తెలిపారు. ఇవి అమెరికా దాడులకు గురైన మూడు అణు కేంద్రాలలో రెండని చెప్పారు.

యురేనియానికి నష్టం వాటిల్లనప్పటికీ, మెటల్‌ మార్పిడి కేంద్రం ధ్వంసం కావడంతో రాబోయే సంవత్సరాల్లో ఇరాన్‌ అణుబాంబును తయారు చేసే సామర్థ్యం దెబ్బతింటుందని రాట్‌క్లిఫ్‌ స్పష్టం చేశారు.ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా తుడిచిపెట్టుకుపోయిందని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ తెలిపారు. కొంతకాలంపాటు అణు ప్రయోగాలకు ముగింపునిచ్చిందని చెప్పారు. అమెరికా దాడులతో ఫోర్డో, నటాంజ్‌, ఇస్పహాన్‌ కేంద్రాలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని, కానీ పూర్తిగా నాశనం చేయలేదని అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ జారీ చేసిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.

గతవారం నాటో శిఖరాగ్ర సమావేశంలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా అమెరికా దాడులు మెటల్  మార్పిడి సౌకర్యాన్ని నాశనం చేసి ఉండవచ్చని సూచించారు. మెటల్‌ మార్పిడి సౌకర్యం లేకుండా అణ్వాయుధాలను తయారుచేయలేరని చెప్పారు. మ్యాప్‌లో కూడా స్పష్టంగా గుర్తించలేకపోతున్నామని, ఎవరూ గుర్తించలేరని, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని వివరించారు.

మరోవంక, అమెరికా దాడుల వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమానికి వచ్చిన ముప్పు పెద్దగా ఏం లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) అధిపతి రఫేల్‌ గ్రాసీ పేర్కొన్నారు. అమెరికా దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత ఇరాన్‌ మళ్లీ యురేనియాన్ని తనకు కావాల్సిన విధంగా శుద్ధి చేయగలదని స్పష్టం చేశారు. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం, ఆ దేశ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం.