ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల కోసం గృహాల గుర్తింపు  

ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల కోసం గృహాల గుర్తింపు  

రాబోయే జనాభా లెక్కల కోసం గృహాల గుర్తింపు (హౌస్‌ లిస్టింగ్‌) కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయని భారత జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. ఇది జనాభా లెక్కల మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని చెప్పారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

పర్యవేక్షకులు, గణకుల నియామకాలు రాష్ట్రాలు, జిల్లా పరిపాలన సహకారంతో జరుగుతుందని వెల్లడించారు.జనాభా లెక్కింపు కార్యక్రమం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో గణకులు ఇంటింటికి వెళ్లి గృహాల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఇంటి గృహ పరిస్థితులు, ఆస్తులు, సౌకర్యాల గురించి సమాచారం సేకరిస్తారు. ఆ తర్వాత రెండో దశలో ఇంటింటికి వెళ్లి జన గణన చేపడతారు. ప్రతి ఇంట్లోని జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను తీసుకుంటారు. ఇది 2027 ఫిబ్రవరి 1 నాటికి జరగనుంది.

జనగణనతో పాటు కుల గణన కూడా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటనలో తెలిపింది. జనగణన కార్యకలాపాల కోసం 34 లక్షలకు పైగా గణకులు, పర్యవేక్షకులు, సుమారు 1.3 లక్షల జనాభా గణన కార్యకర్తలను నియమించనున్నారు. మరికొద్ది రోజుల్లో చేపట్టనున్నది 16వ జనాభా గణన. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎనిమిదవది. రాబోయే జనాభా గణనను మొబైల్ అప్లికేషన్​లను ఉపయోగించి డిజిటల్ విధానంలో నిర్వహిస్తారు. 

డిజిటల్‌ విధానంతో జనాభా లెక్కించేందుకు అధికారులతోపాటు ప్రజలకూ అవకాశం ఇవ్వనున్నారు. రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం పౌరులను అడగడానికి దాదాపు 30కిపైగా ప్రశ్నలను సిద్ధం చేసింది. ఈ సర్వేలో ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్, స్కూటర్, బైక్, కారు, జీప్, వ్యాన్), గృహోపకరణాలు (రేడియో, టీవీ, ట్రాన్సిస్టర్) వంటి వస్తువుల యాజమాన్యం గురించి ప్రజలను అడుగుతారు.

తృణధాన్యాల వినియోగం, తాగునీటి వనరులు, లైటింగ్, మరుగుదొడ్లు వాడకం, స్నానం, వంటగది సౌకర్యాలు, వంట కోసం ఉపయోగించే ఇంధనం, ఎల్పీజీ/పీఎన్జీ కనెక్షన్ గురించి కూడా అడుగుతారు. ఇంటి ఫ్లోరింగ్, గోడలు, పైకప్పు కోసం ఉపయోగించిన మెటిరీయల్, నివాసితుల సంఖ్య, ఇంటి గదుల సంఖ్య, ఇంటి యజమాని గురించి ప్రశ్నలు ఉంటాయి. జనగణన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్​లకు భారత జనాభా లెక్కల కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ మృతుంజయ్ కుమార్ నారాయణ్ లేఖ రాశారు.

జనాభా లెక్కల ప్రక్రియకు తుది తేదీగా పరిగణించే ఈ ఏడాది డిసెంబర్ 31కి ముందు పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో ఏవైనా ప్రతిపాదిత మార్పులు చేయాలని అందులో కోరారు.  జనగణన కోసం అన్ని గ్రామాలు, పట్టణాలను ఏకరీతి గణన బ్లాక్​లుగా విభజించామని పేర్కొన్నారు. జనగణన సమయంలో ఎటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండటానికి ప్రతి బ్లాక్​కు ఒక గణకుడిని నియమిస్తామని వెల్లడించారు.

2026 ఏప్రిల్ 1 నుంచి హౌస్‌ లిస్టింగ్ ఆపరేషన్లు, సూపర్‌ వైజర్లు, గణకుల నియామకం, వారి మధ్య పని విభజన జరుగుతుందని మృతుంజయ్ కుమార్ తెలిపారు. 2027 ఫిబ్రవరి 1 నాటికి జనగణన ప్రారంభమవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 31 లోపు మున్సిపల్ కార్పొరేషన్లు, రెవెన్యూ గ్రామాలు, సబ్ డివిజన్లు, జిల్లాల సరిహద్దుల్లో ఏవైనా ప్రతిపాదిత మార్పులు చేయాలని అన్ని విభాగాలను ఆదేశించాలని అన్ని రాష్టాల సీఎస్​లను కోరారు. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. ఆఖరిగా 2011లో జనాభా లెక్కలు సేకరించారు. ఆ తర్వాత కరోనా కారణంగా 2021లో నిర్వహించాల్సిన జనగణన నిలిచిపోయింది. తాజాగా 16వ జనగణనకు సిద్ధమైంది కేంద్రం.