
పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల వరకు హిందీ భాషను విధిగా బోధించాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. భాషా విధానంపై ముందుకు సాగడానికి విద్యావేత్త నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
“ఒకటో తరగతి నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి సంబంధించి ఏప్రిల్, జూన్‌లలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విధానం అమలుపై సిఫార్సులు చేసేందుకు డా.నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం” అని ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఫడణవీస్ తెలిపారు.
ఆ తర్వాత 1 నుంచి 12వ తరగతి వరకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని డా.రఘునాథ్ మషేల్కర్ కమిటీ చేసిన సిఫార్సులను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించారని, దాని అమలుపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తాము హిందీని బలవంతంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, వాస్తవానికి, ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకుందని వెల్లడించారు.
జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం ఇప్పటికే పేర్కొంది. ఆ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది. ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే స్పష్టం చేసింది.
అయితే ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1-5 తరగతుల విద్యార్థులకు హిందీని మూడో భాషగా తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో హిందీని ఆప్షనల్‌గా మారుస్తూ సవరణ ఉత్తర్వు జారీ చేసింది. ఈ విషయమై ప్రభుత్వంపై పోరాడేందుకు శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలు ఏకం కానున్నారని వార్తలు వచ్చిన సమయంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, “మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన రెండు ప్రభుత్వ తీర్మానాలను ఉపసంహరించుకుంది . విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలోని కొత్త కమిటీ దానిని అధ్యయనం చేసి తన నివేదికను సమర్పిస్తుంది” అని తెలిపారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు