
ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పారు. అందరూ తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు.
దేశంలో ఎమర్జెన్సీ విధించిన వారు రాజ్యాంగాన్ని హత్య చేసి, న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని విమర్శించారు. నాడు జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారని గుర్తు చేశారు. కానీ, భారత ప్రజలు శక్తిమంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని, దానిని విధించినవారు ఓడిపోయారని గుర్తు చేశారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడాన్ని ప్రస్తావించిన ప్రధాని, ఎమర్జెన్సీపై పోరాడిన మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, బాబూ జగ్జీవన్ రామ్ వంటి నేతల ప్రసంగాలను మోదీ ప్రస్తావించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని కచ్చితంగా స్మరించుకోవాలనీ అది రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందని చెప్పారు.
భారత జనాభాలో 64 శాతం కన్నా ఎక్కువ మంది దాదాపు 95 కోట్లమంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకంతో లబ్ధి పొందుతున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపిందని ప్రధాని వివరించారు. 2015లో సామాజిక రక్షణ ఫలాలు కేవలం 25 కోట్ల మందికి అందేవని గుర్తుచేశారు. శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రాకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ధరించిందని తెలిపారు.
ఇటీవలి అంతర్జాతీయ యోగా డేను యావత్ ప్రపంచం జరుపుకుందనీ, అందరి జీవితాల్లో యోగా భాగమవుతోందని మోదీ హర్శం వ్యక్తం చేశారు. జూన్ 21న జరిగిన యోగా డే కార్యక్రమాల్లో దేశ, ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది పాల్గొన్నారని గుర్తు చేశారు. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం ఏటేటా మరింత విస్తరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
చాలాకాలం తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైందన్న మోదీ, యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్ మారిందని ప్రధాని మోదీ అభినందించారు. పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని, దేశంలోని చిన్నారులకు వీరు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్నెస్, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాని సలహా ఇచ్చారు. మేఘాలయ ఎరీసిల్క్కు జీఐ ట్యాగ్ లభించిందని ప్రశంసించారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకతని తెలిపారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి