ఆర్.ఎస్.ఎస్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ కరపత్రం

ఆర్.ఎస్.ఎస్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ కరపత్రం

సోషల్ మీడియాను ఆధారం చేసుకుని ‘ఆర్.ఎస్.ఎస్’ పేరు వాడుకుంటూ  దుర్వినియోగం చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర ఒకటి బయటపడింది. ఇందుకోసం కొందరు వ్యక్తులు ‘రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సంకల్పం’ పేరిట ఒక ఒక కులంపై విషప్రచారం చేస్తూ కొంత కంటెంట్ రూపొందించారు. ఆ కంటెంట్ ను ఆర్.ఎస్.ఎస్ ఇటీవల విడుదల చేసిన కరపత్రాన్ని పోలివుండే విధంగా దాన్ని డిజైన్ చేసి వాట్సాప్ గ్రూపుల్లోకి వదలడంతో అది గత కొన్ని రోజులుగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

2025 మార్చిలో రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారత ప్రతినిధి సభలు జరిగాయి. ఆ సభల్లో ఆర్.ఎస్.ఎస్ చేసిన సత్ సంకల్పం కార్యకర్తలందరికీ చేరేవిధంగా ఒక కరపత్రం రూపొందించింది. సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ప్రపంచ శాంతి మరియు సమృద్ధి కోసం సమరసతతో కూడిన సంఘటిత హిందూ సమాజ నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ ఆర్.ఎస్.ఎస్ చేసిన సంకల్పాన్ని వివరిస్తూ, దేశ రక్షణ, ధర్మ రక్షణ, తద్వారా ప్రపంచశాంతి సౌభ్రాతృత్వాలకు ఎలా ప్రయతించాలో తెలియజేస్తూ ఉన్న ఆ కరపత్రంలోని అంశాలను కొందరు వ్యక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వక్రీకరించి, పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు.

దీన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కరపత్రాన్ని చూడగానే అది నకిలీ అని గమనించవచ్చు. అదేమంటే, నిజానికి రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారత ప్రతినిధి సభలు 2025 మార్చిలో జరిగాయి. కానీ నకిలీ కరపత్రంలోని హెడ్డింగులో మాత్రం మే 2025 జరిగినట్టు ఉంది.  ఇకపోతే నిజమైన కరపత్రం నాలుగు పేజీలు ఉండగా, రెండు పేజీల్లో తెలుగు కంటెంట్, మిగిలిన రెండు పేజీల్లో ఇంగ్లిష్ కంటెంటు ఉంటుంది. కానీ నకిలీ కరపత్రం మాత్రం మూడు పేజీల తెలుగు కంటెంటుతో సృష్టించారు.

నిజమైన కరపత్రం ఆఖరిలో, అంటే రెండవ పేజీ చివరిలో రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ చేసిన సత్ సంకల్పాన్ని పూర్తిచేయడానికి 3 ముఖ్యమైన అంశాలు స్వయంసేవకులకు సూచించబడ్డాయి. కానీ నకిలీ కరపత్రం చివరిలో అంటే మూడవ పేజీ రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ లోని కొందరు కీలకమైన అధికారుల పేర్లు ఉంటాయి. ఇకపోతే నకిలీ కరపత్రం నిండా ఒక సామజిక వర్గాన్ని కించపరుస్తూ రాసివున్న కంటెంట్ ఉంటుంది. ఈ విషపురాతలు బట్టి ఆ కరపత్రం నిజమైనదా కాదా అనేది ఇట్టే పసిగట్టొచ్చు.

ఆరెస్సెస్ పేరుతో సాగే ఇలాంటి దుష్ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలిసి చేసినా, తెలియక చేసినా.. సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ కంటెంట్ ద్వారా దుష్ప్రచారం చేసే వ్యక్తులు ఇటువంటి చట్టపరమైన సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అటువంటి నకిలీ కరపత్రాలు ఎవరైనా వాట్సాప్ గ్రూపుల్లో తెలిసో తెలియకో షేర్ చేస్తే, వెంటనే మీ గ్రూప్ అడ్మిన్ కి తెలియజేసి, దాన్ని తొలగించాల్సిందిగా సూచించండి. అలాగే అది పంపిన వ్యక్తిని కూడా అప్రమత్తం చేసి, మరోసారి ఆ నకిలీ కరపత్రం ఎవరికీ పంపకుండా జాగ్రత్తపడేలా చేయండి.