ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ!

ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ‌చ్చే నెల జూలై 2 నుండి 9 వరకు ఐదు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ దక్షిణ దేశాలతో భారతదేశం సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ నమీబియాలను సందర్శించ‌నున్నారు. బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొంటారు. జూలై 2–3 లలో ఘానా, జూలై 3–4 లలోట్రినిడాడ్ & టొబాగోలో,  జూలై 4–5లలో అర్జెంటినాలో,  జూలై 5–8లలో బ్రెజిల్ లో, జూలై 9న నమీబియాలో పర్యటిస్తారు.

ప్రధాని పర్యటన ఘానాలో జూలై 2–3 తేదీలలో ప్రారంభమవుతుండ‌గా గత 30 సంవత్సరాలలో ఘానాకు వెళ్తున్న తొలి భారత ప్రధాని పర్యటన కావడం విశేషం. ఇరుదేశాల మధ్య అభివృద్ధి సహకారం, విద్య, రక్షణ, ఇంధన రంగాలలో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చే దిశగా చర్చలు జరుగుతాయి.  1999 తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో కి వెళ్లిన తొలి భారత ప్రధాని పర్యటనగా గుర్తింపు పొందుతోంది. మోదీ అక్కడ పార్లమెంట్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా ఇండియన్ డయాస్పోరాతో కూడా సమావేశం జరుగుతుంది.

ప్రధాని మోదీ, అర్జెంటినా అధ్యక్షుడు జవియర్ మిలీతో కలిసి వ్యూహాత్మక రంగాలలో—కృషి, రక్షణ, మైనింగ్, శక్తి, అంతరిక్ష రంగాలలో—భారత-అర్జెంటినా సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా చర్చలు జరుపనున్నారు. మోదీ బ్రెజిల్ లోని రియో డి జెనెరోలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత నేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ టెర్రరిజం, వాతావరణ మార్పులు, బహుపాక్షిక వ్యవస్థలలో సంస్కరణలపై చర్చిస్తారు. అనంతరం బ్రాసీలియాలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇన్నాసియో లులా డా సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.

చివరిగా జూలై 9న నమీబియాకు మోదీ తొలి పర్యటన. ప్రధాని మోదీ అక్కడి అధ్యక్షురాలు నెటుంబో నాండీ-న్డైట్‌వాను కలుసుకుంటారు, స్వాతంత్ర్య పోరాట నాయకుడు సామ్ నుజోమా స్మారక స్థలానికి నివాళులు అర్పిస్తారు, నమీబియా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్-నమీబియా మధ్య పునరుత్పాదక శక్తి, వన్యప్రాణుల సంరక్షణ రంగాలలో సహకారం ప్రధాన అంశాలుగా ఉంటాయి.

ఈ పర్యటనతో భారతదేశం అభివృద్ధి, భద్రత, అంతర్జాతీయ ఆర్థిక పాలనలో తన పాత్రను మరింతగా ఆవిష్కరించనుంది. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ దృఢ మద్దతును తెలిపే ఈ పర్యటన, భవిష్యత్ సౌహార్దభరిత సంబంధాలకు గట్టి పునాదులు వేస్తుందని అంచనా.