
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లకు కచ్చితంగా శిక్ష పడాలని, వారిద్దరూ జైలుకు వెళ్లాలని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు ఆయన హాజరయ్యారు.
ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. 2023 నవంబర్‌లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.
“గతంలో నా ఫోన్ చాలాసార్లు ట్యాప్ అయింది. దీనిపై నేను అప్పుడే ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరగాలి” అని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అధికారులు చూపించారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు వ్యతిరేకత వచ్చిందని, దాంతో అభద్రత భావంతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెబుతూ తన ఆఫీస్‌లో వారెంట్ లేకుండా వచ్చి కొందరు పోలీస్ అధికారులు దౌర్జన్యం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని వెల్లడించారు. గత డీజీపీ మహేందర్‌రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో తనతో పాటు తన అనుచరుల మూవ్‌మెంట్‌ని కూడా పసిగట్టారని చెప్పారు. తన స్నేహితుడు బంగారం కొన్న రూ.72 కోట్లను పోలీసులు పట్టుకున్నారని, అవి తన డబ్బులు అన్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తేనె నుంచి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్ ట్యాప్ చేసి, అతన్ని బెదిరించి రూ. 13 కోట్ల విలువ చేసే తమ పార్టీ ఎలక్టోరల్ బాండ్లను గత ప్రభుత్వం కొనిపించిందని తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేసీఆర్, కేటీఆర్‌లకు కఠిన శిక్ష విధించాలని విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రస్తావించి, జాతీయ స్థాయిలో చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సమగ్రంగా నిరూపించేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.
కాగా, దుబ్బాక ఉప ఎన్నికలతోనే ఫోన్ ట్యాపింగ్ ప్రారంభమైందని డిజిపికి అనేకసార్లు ఫిర్యాదు చేశానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధంలేని కాంగ్రెస్ నాయకులను సిట్ పిలుస్తోందని పేర్కొంటూ ఫోన్ ట్యాపింగ్‌లో గాడిద గుడ్డు తప్ప చర్యలు ఉండవని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూలాఖత్ అయ్యాయని విమర్శించారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి