
భార్య సంపాదిస్తున్నా భర్త ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఒక మహిళ సంపాదిస్తున్నందున, ఆమె తన జీవన ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నందున, భర్త నుండి ఆర్థిక సాయం పొందకుండా ఉండకూడదని తీర్పునిచ్చింది. భర్త నుండి విడిపోవడానికి ముందు భార్య అలవాటు పడిన జీవన ప్రమాణాలను పొందేందుకు అర్హురాలని పేర్కొంది.
తన భార్యకు నెలకు రూ.15,000 భరణం చెల్లించాలని ఆదేశిస్తూ 2023 ఆగస్ట్ కుటుంబ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తన భార్య నెలకు రూ.25,000 కంటే ఎక్కువ సంపాదిస్తోందని, తన నుండి ‘అధిక’ భరణం కోరలేదని ఆ వ్యక్తి పిటిషన్లో పేర్కొన్నాడు. తన నెలవారీ సంపాదన తన భార్యకు నెలకు రూ.15,000 భరణం ఇచ్చేంత ఎక్కువగా లేదని తెలిపాడు.
అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రులను తాను చూసుకోవాల్సి వుందని పేర్కొన్నాడు. అయితే ఆ వ్యక్తి తక్కువ సంపాదిస్తున్నాడనే వాదనను అతని భార్య తోసిపుచ్చింది. అతను నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని ఆమె పేర్కొంది. భార్య సంపాదిస్తున్నప్పటికీ, ఆమె ఉద్యోగం కోసం రోజూ చాలా దూరం ప్రయాణించాల్సి వస్తున్నందున ఆ ఆదాయం ఆమె పోషణకు సరిపోదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అంత తక్కువ ఆదాయంతో ఆమె మంచి జీవనం గడిపే స్థితిలో లేదని హైకోర్టు పేర్కొంది. భార్య సంపాదిస్తున్నందున, ఆమె భర్త నివాసంలో అలవాటుపడిన జీవన ప్రమాణాలను పొందేందుకు ఆమె భర్త నుండి మద్దతును కోల్పోకూడదని జస్టిస్ దేశ్పాండే పేర్కొన్నారు. భార్య కంటే అతను ఎక్కువ సంపాదిస్తాడని, ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేవని కోర్టు పేర్కొంది.
ఆ మహిళ ప్రస్తుతం తన తల్లిదండ్రులు, సోదరుడితో నివసిస్తున్నప్పటికీ, వారందరికీ అసౌకర్యం, ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నందున, అలాగే కొనసాగించలేమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అతని తండ్రికి నెలకు రూ.28,000 పెన్షన్ వస్తున్నందున వారు ఆ వ్యక్తిపై ఆధారపడటం లేదని తెలిపింది. స్త్రీ, పురుషుల ఆదాయంలో భారీ వ్యత్యాసం ఉందని, దీనిని పోల్చలేమని పేర్కొంటూ కుటుంబ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది.
More Stories
500 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్