డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తో ఏపీలో అభివృద్ధి పరుగులు

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తో ఏపీలో అభివృద్ధి పరుగులు
 
డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్ల ఆంధ్రప్రదేశ్​లో అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని  చెబుతూ ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నట్లు కొనియాడారు.
 
రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్‌ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎంపీ పురందేశ్వరితో పాటు తదితరులు పాల్గొన్నారు.
 
“దేశంలో పర్యాటకుల సందర్శన మరింత పెరిగింది. ప్రపంచంలోనే సందర్శకుల శాతం వేగంగా పెరిగింది భారత్‌లోనే. టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందుతోంది. దేశంలో పర్యాటకానికి సురక్షితమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి.” అని కేంద్ర మంత్రి తెలిపారు.

పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటకులను మరింత ఆకర్షించే ప్రక్రియ కొనసాగుతోందని షెకావత్‌ తెలిపారు. సందర్శకులకు మంచి వసతి, ఆహారం, సులభతర రవాణా కీలకమని చెప్పారు. వారికి మరిన్ని వసతులు కల్పించడంలో వేగంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ఆతిథ్యానికి భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని షెకావత్ వెల్లడించారు.

రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు, ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని గుర్తు చేశారు. “పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షలమంది సందర్శకులు పెరిగే అవకాశం. శక్తిమంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్‌ కారణం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

“డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమని ఆనాడు చెప్పాం. ప్రజలు మాపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి గెలిపించారు. వికసిత్‌ భారత్‌లో వికసిత్‌ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం. అమరావతి, పోలవరం ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తోంది. అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం” అని పురందేశ్వరి చెప్పారు.