సింధూ జలాల ఒప్పందంతో జెకేకు రూ 60 వేల కోట్ల నష్టం

సింధూ జలాల ఒప్పందంతో జెకేకు రూ 60 వేల కోట్ల నష్టం
1960లో ద్వైపాక్షిక ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి సింధు జలాల ఒప్పందం కారణంగా జమ్మూ కాశ్మీర్ రూ. 60,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టాలను చవిచూసిందని ఒక నిపుణుడు తెలిపారు. “జమ్మూ కాశ్మీర్ ఈ ఒప్పందం వల్ల తీవ్రంగా నష్టపోయింది” అని కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర మాజీ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ అలీ పేర్కొన్నారు.
 
నష్టం నిజమైన పరిధిని తెలుసుకోవడానికి శాస్త్రీయ అంచనా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారిక నివేదికలు ప్రకారం 1960 నుండి 1998 మధ్య జరిగిన నష్టం రూ. 20,000 కోట్లుగా పేర్కొన్నాయని డాక్టర్ అలీ చెప్పారు. ఈ ఒప్పందం కింద, పాకిస్తాన్ పశ్చిమ నదుల (సింధు, జీలం  చీనాబ్) కేటాయింపును పొందింది. భారతదేశం తూర్పు నదుల (రావి, బియాస్, సట్లెజ్) కేటాయింపును పొందింది.
 
డాక్టర్ అలీ ప్రకారం, ఒక నిర్దిష్ట ఎత్తుకు మించి ఆనకట్టలు నిర్మించడానికి అనుమతించకపోవడంతో 13 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు ఇవ్వలేని కారణంగా జమ్మూ కాశ్మీర్ నష్టాలు పెరగడం ప్రారంభించాయి. ఫలితంగా, రాష్ట్రం చీనాబ్, సింధు నదీ జలాలను గరిష్టంగా ఉపయోగించుకోవడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. 
 
“విద్యుత్ ప్రాజెక్టుల కోసం మనం పెద్ద ఆనకట్టలను నిర్మించలేము. నది ప్రవాహ వనరులను మనం ఉపయోగించుకోవాలి. మనకు పెద్ద ఆనకట్టలు ఉంటే, మనం ఎక్కువ నీటిని నిల్వ చేసి, ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగేవాళ్ళం” అని తెలిపారు. ఇటువంటి వినియోగం లేకపోవడం వల్ల ఇంధన వనరుగా విద్యుత్ కోల్పోవడం,  పరిమిత వ్యవసాయ కార్యకలాపాలు జరిగాయి. ఇది అభివృద్ధిపై ప్రభావం చూపింది.
 
లేకపోతే, మనకు ఇక్కడ పెద్ద పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు గల 20,000 మెగా వాట్ల జలవిద్యుత్ సామర్థ్యంలో, కేవలం 3,400 మెగావాట్లు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా 1954లో స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థగా ఉన్న జమ్మూ కాశ్మీర్  ఇప్పుడు కేంద్ర నిధులపై ఆధారపడి ఉంది. అందుకు పాక్షికంగా సింధూ జల ఒప్పందం  పాక్షికంగా బాధ్యత వహిస్తుందని ప్రొఫెసర్ చెప్పారు. 
 
గత రాష్ట్ర ప్రభుత్వాలు బాహ్య కన్సల్టెంట్లను నియమించడం ద్వారా ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలను లెక్కించడానికి రెండు సార్లు ప్రయత్నించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, 2013లో జరిగిన మొదటి ప్రయత్నం అధికారిక నిర్లక్ష్యం కారణంగా కన్సల్టెంట్ వెనక్కి తగ్గడంతో ప్రారంభం కాలేదు. 2018లో జరిగిన రెండవ ప్రయత్నం తెలియని కారణాల వల్ల వాయిదా పడింది.