నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేషన్

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేషన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా నామినేషన్ దాఖలైంది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర స్థాయికి చేరిన కాల్పుల విరమణకు ఆయన తీసుకున్న చొరవ, మధ్యవర్తిత్వం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మేరకు అమెరికా ప్రతినిధి బడ్డీ కార్టర్ నామినేషన్ సమర్పించారు. 12 రోజుల పాటు ముదిరిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ఆపగలిగినందుకు ఆయనను ‘చారిత్రాత్మక నాయకుడు’గా ప్రశంసిస్తున్నారు.

శాంతి సాధనలో ఆయన పాత్ర అసాధారణమని బడ్డీ కార్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ కమిటీ ట్రంప్ నామినేషన్‌ను పరిగణలోకి తీసుకుంది. ఇక మరోవైపు, ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచంలోని యుద్ధాలకు మూలకారణమే ఆయన అని ఇరాన్, రష్యా నేతలు ఆరోపిస్తున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారన్న విమర్శలు ఊపందుకున్నాయి.

ట్రంప్ పాలనలో వివాదాస్పద నిర్ణయాలురెండోసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ట్రంప్ తీసుకున్న కొన్ని విధానాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దిగుమతి సుంకాలు పెంపు, వలసదారులపై కఠిన నిబంధనలు, ట్రాన్స్‌జెండర్లపై ఆంక్షలు వంటి చర్యలు ఆయన పాలనకు ప్రత్యేకతగా నిలిచాయి. అయితే శాంతి సాధనలోనూ కొంత పరిణితి చూపించిన నేతగా ఆయనను కొందరు మన్నిస్తున్నారు.

ట్రంప్ నామినేషన్ రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. శాంతి సాధనకే ఈ బహుమతి ఇవ్వాలా? లేక రాజకీయ శక్తుల ప్రతిష్టాపనకేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంలో నోబెల్ కమిటీ నిర్ణయం ఏ మలుపు తిరుగుతుందో అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య పాలనలో అనే మార్పులు తీసుకొచ్చారు. దిగుమతి సుంకాలు, వలసవాదంపై ఉక్కుపాదం, ట్రాన్స్‌జండర్లపై కఠినంగా వ్యవహరించడం వంటి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు.  అటు భారత్, పాక్ యుద్ధంలో కూడా అమెరికా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేసిందని చెప్పుకుంది.

అంతకు ముందు, జూన్ 18న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కాగా, జూన్ 20న పాక్ సర్కారు భారత్ – పాక్ సైనిక ఘర్షణను ఆపినందుకు ట్రంప్‌ పేరును నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి సిఫారసు చేసింది. అయితే ఇరాన్‌‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ఈ లేఖను వెనక్కి తీసుకోవాలంటూ పాక్ ప్రభుత్వంపై ప్రధాన రాజకీయ పక్షాలు, ప్రముఖ నేతలు ఒత్తిడిని తీసుకు రావడంతో వెనుకడుగు వేసింది.