దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ అత్యవసర పరిస్థితిని భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో వివరించడానికి ‘ది ఎమర్జెన్సీ డైరీ’ పుస్తకం తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో ఎలా రాజ్యాంగ స్పూర్తిని ఉల్లంఘించారో ఏ ఒక్క భారతీయుడు కూడా మరిచిపోలేరని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “భారత ప్రజాస్వామ్య చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటైన ‘ఎమర్జెన్సీ’కి నేటికి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. అందుకే భారత ప్రజలు ఈ రోజును రాజ్యాంగ హత్యా దినోత్సవం (సంవిధాన్ హత్య దివస్)గా జరుపుకుంటున్నారు. ఈ రోజున భారత రాజ్యాంగం చెప్పిన విలువలను పక్కన పెట్టారు” అని ప్రధాని పేర్కొన్నారు.
“ప్రాథమిక హక్కులను నిలిపివేశారు. పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టారు. అనేక మంది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, విద్యార్థులను, సాధారణ పౌరులను జైలులో పెట్టారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే ఖైదు చేసింది” అని ప్రధాని మోదీ విమర్శించారు.
‘ది ఎమర్జెన్సీ డైరీస్’ బుక్ ఆవిష్కరణ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం సాయంత్రం ‘ది ఎమర్జెన్సీ డైరీస్- ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఎ లీడర్’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ప్రత్యేకంగా ముందుమాట రాశారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నరేంద్ర మోదీ పోషించిన కీలక పాత్ర గురించి ఈ పుస్తకంలో సవివరంగా రాశారు. యువ మోదీతో పనిచేసిన మరికొందరు అనుభవాలను కూడా ఆ గ్రంధంలో ప్రచురించారు.
ఆనాడు మోదీ యువ ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. దీనిపై తాజా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఎమర్జెన్సీ కాలంలో నేను చేసిన పోరాటం గురించి ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకం తెలియజేస్తుంది. అది ఆ కాలం నాటి చాలా జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది” అని ప్రధాని చెప్పారు. “ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్లో బాధలు అనుభవించినవారు, తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని నేను కోరుతున్నాను. దీని వల్ల 1975 నుంచి 1977 వరకు ఉన్న అవమానకరమైన కాలం గురించి నేటి యువతకు అవగాహన కల్పిస్తుంది” అని తెలిపారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్