విమాన ప్రమాద బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉంది

విమాన ప్రమాద బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉంది

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనలో అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్‌ దర్యాప్తు భారత్‌లోనే చేపడుతున్నామని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ అంశంపై మీడియాలో వస్తున్న పలు వార్తా కథనాల్ని తోసిపుచ్చుతూ, భారత్‌లోని ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో’ మాత్రమే దర్యాప్తు చేస్తున్నదని ఆయన చెప్పారు.

ఈ దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్‌ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలను పౌర విమానయాన మంత్రి కొట్టిపారవేసారు.  అవన్నీ అవాస్తవాలేనని పేర్కొంటూ బ్లాక్‌బాక్స్‌ భారత్‌లోనే ఉందని వెల్లడించారు.
పూణెలో జరిగిన ఓ సమ్మిట్‌లో పాల్గొన్న కేంద్ర మంత్రిని బ్లాక్‌ బాక్స్‌ గురించి విలేకర్లు ప్రశ్నించారు. 
విశ్లేషణ కోసం బ్లాక్‌బాక్స్‌ విదేశాలకు పంపుతున్నారా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ “అలాంటిదేమీ లేదు. అవన్నీ అవాస్తవాలే. బ్లాక్‌బాక్స్‌ ప్రస్తుతం భారత్‌లోనే ఉంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం పరిశీలిస్తోంది” సమాధానమిచ్చారు. ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. మొత్తం మృతుల్లో విమాన ప్రయాణికులు 241 మందికాగా, మరో 34 మంది ఘటనాస్థలానికి చెందిన ఇతరులుగా పేర్కొన్నది. 
మృతదేహాలన్నీ స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 260 మృతదేహాల్ని డీఎన్‌ఏ పరీక్షల ద్వారా, ఆరు మృతదేహాలల్ని ముఖ గుర్తింపు ద్వారా గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ ఎI-171 విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే ఓ బిల్డింగ్‌పై ఉప్పకూలిన విషయం తెలిసిందే. విమానం కూలిన వెంటనే దాదాపు 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 270 మంది వరకూ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదం జరిగిన దాదాపు 27 గంటల తర్వాత ఈ బ్లాక్‌బాక్సును విమానం కూలిన బిల్డింగ్‌పై గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ఈ బ్లాక్‌ బాక్స్‌ చాలా కీలకం. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బ్లాక్‌బాక్స్‌ దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని విశ్లేషించేందుకు విదేశాలకు పంపుతున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి.