మహారాష్ట్ర ఎన్నికలు చట్ట ప్రకారమే జరిగాయ్

మహారాష్ట్ర ఎన్నికలు చట్ట ప్రకారమే జరిగాయ్

మహారాష్ట్రలో 2024లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ అధికారికంగా స్పందించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లు చట్ట ప్రకారమే జరిగాయని పేర్కొంది. అయినా ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, తమకు లేఖ రాస్తే వివరణ ఇస్తామనీ లేదా వ్యక్తిగతంగా రాహుల్‌ వచ్చి కలిస్తే అన్ని అంశాలపై చర్చించాలని కమిషన్‌ భావిస్తోందని ఈసీ వివరించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకల జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓ ప్రముఖ దినపత్రికకు రాసిన ఆర్టికల్లో 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందనీ, రాబోయే బిహార్‌ ఎన్నికల్లోనూ అదే జరగబోతోందని రాహుల్ బీజేపీ, ఈసీలపై రాహుల్‌ విమర్శలు చేశారు. దీంతో ఆయన రాసిన కథనంపై ఈసీ స్పందించింది. 

జూన్ 12 ఈ-మెయిల్ ద్వారా రాహుల్ గాంధీకి లేఖ రాసింది. అందులో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బూత్లెవల్ ఏజెంట్లతో సహా వేలమంది పాల్గొన్నారని ఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర ఎన్నికల కోసం 1,00,186 మంది బూత్లెవల్ అధికారులు, 288 మంది ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారులు, 139 మంది పరిశీలకులు, 41 మంది పోలీసు సిబ్బంది, 288 మంది రిటర్నింగ్ అధికారులను కమిషన్ నియమించిందని తెలిపింది. 

1,08,026 మంది బూత్ లెవల్ ఏజెంట్లను కేంద్ర, రాష్ట్ర రాజకీయ పార్టీలు నియమించాయని వివరించింది. వీరిలో 28,421 మంది కాంగ్రెస్ ఏజెంట్లు ఉన్నారని తెలిపింది. ఒక వేళ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అనిపిస్తే, ఎలక్షన్ జరిగిన 45 రోజల్లోగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చుకదా? అని ఈసీ పేర్కొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వికేంద్రీకృత పద్ధతిలో జరుగుతుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

“ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి అంశాలను కాంగ్రెస్‌ అభ్యర్థులు సంబంధిత  కోర్టు (హైకోర్టు)లో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ల ద్వారా లేవనెత్తినట్లుగా విశ్వసిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె మాకు లేఖ వ్రాయొచ్చు. అన్ని అంశాలను చర్చించేందుకు వ్యక్తిగతంగా కలిసేందుకు కూడా కమిషన్‌ సిద్ధంగా ఉంది” అని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

గత సంవత్సరపు ఎన్నికల్లో ఫడ్నవీస్ ప్రభుత్వం 38,000 ఓట్లతో గెలిచిందని, కేవలం ఐదు నెలల్లోనే ఓటర్ల జాబితా ఎనిమిది శాతం పెరిగిందని పేర్కొన్నారు. అందులో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓటు వేసినట్లుగా బూత్ లెవల్ అధికారులు తెలిపారని రాహుల్ గాంధీ తెలిపారు. అందుకే సీసీ పుటేజీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సీసీ ఫుటేజ్ విడుదల చేయలేమని ఈసీ తేల్చిచెప్పింది.