జులై 1 నుండి పెరగనున్న రైల్వే చార్జీలు 

జులై 1 నుండి పెరగనున్న రైల్వే చార్జీలు 

రైల్వే ప్రయాణికులపై టిక్కెట్‌ ధరలు పెరగనున్నట్లు సంబంధిత రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు సుదూరం ప్రయాణించే నాన్‌ ఏసి, ఏసి ప్రయాణికులపై స్వల్ప ప్రభావం చూపనున్నాయని పేర్కొన్నాయి. పెరిగిన ధరలు జులై 1 నుండి అమల్లోకి రానున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.  కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారి రేట్లను పెంపు ఉండనుందని పేర్కొన్నాయి.

మెయిల్‌, ఎక్స్‌ప్రెన్‌, నాన్‌ ఏసి రైళ్లకు కిలోమీటరుకు 1 పైసా, ఏసి తరగతులకు కిలో మీటరుకు 2 పైసలు పెరగనున్నాయి. అయితే 500 కి.మీ వరకు ప్రయాణాలకు సబర్బన్‌ టిక్కెట్లు, సెకండ్‌ క్లాస్‌ ప్రయాణాలకు చార్జీల పెంపు వర్తించదు. 500 కి.మీ దాటితే సెకండ్‌ క్లాస్‌కు కిలో మీటరుకు అరపైసా పెంపు ఉండనుంది. అంటే ఉదాహరణకు ఈ తరగతిలో ఎవరైనా 600 కి.మీ దూరం ప్రయాణిస్తే వారిపై అదనంగా 50 పైసలు (100 కి.మీ x 0.005 పైసలు) పెరుగుతుంది.

రోజువారీ, నెలవారీ సీజన్‌ టిక్కెట్ల ధరల్లో కూడా మార్పు ఉండదని ఆ వర్గాలు తెలిపాయి.  తత్కాల్‌ బుకింగ్‌లో కూడా నిబంధనలను మారనున్నట్లు  ఆ వర్గాలు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ నడిచే 13 వేల రోజువారీ నాన్‌ ఏసీ-మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ పెరిగిన చార్జీలు వర్తిస్తాయని, చాలా ఏండ్ల తర్వాత ప్రభుత్వం రైలు చార్జీలు పెంచనుందని, కొత్త చార్జీలు ప్రయాణికుల బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపదని ఆ సీనియర్‌ రైల్వే అధికారి తెలిపారు.

కాగా, రైలు టికెట్ల రిజర్వేషన్‌లో అక్రమాలు చోటుచేసుకోకుండా జూలై 1 నుంచి టికెట్లు బుక్‌ చేసే ప్రతి ప్రయాణికుడు తప్పక ఆధార్‌ నమోదు చేసుకోవాలి. అలాగే జూలై 15 నుంచి ప్రయాణికుడి ఆధార్‌ ఆథంటికేషన్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది.