ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినా ఇరాన్ కాల్పులు

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించినా ఇరాన్ కాల్పులు
* అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం
ఇజ్రాయెల్- ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పలు విమరణ ఒప్పందం జరిగినట్లు తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్రూత్‌’లో పోస్టు చేశారు.  12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని, యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. 
మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించారు. అయితే ట్రంప్‌ ప్రకటనను ఇరాన్‌ ఖండించింది. కాల్పుల విరమణకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించిన కొద్ది సేపటికే దాడులు ప్రారంభించాయి. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
 
కాగా, తమ అణు కేంద్రాల మీద అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ సోమవారం ప్రతీకార దాడులకు దిగి, ఇరాన్‌, ఇరాక్‌లలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించిన కొద్దిసేపటికి ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అగ్రరాజ్యం దురాక్రమణకు వ్యతిరేకంగా ఆపరేషన్‌ ‘బెషారత్‌ ఫతాహ్‌’ను ప్రారంభించినట్టు ప్రకటించింది. 
 
ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం అల్‌ ఉదీద్‌పై క్షిపణులతో దాడిచేసినట్టు ఇరాన్‌ టీవీ వెల్లడించింది. అల్‌ ఉదీద్‌ పశ్చిమాసియాలోనే అమెరికాకు ఉన్న అతిపెద్ద సైనిక స్థావరం. ఖతార్‌ రాజధాని దోహాకు వెలుపల ఉన్న ఈ స్థావరంలో సుమారు 10వేల మంది అమెరికన్‌ సైనికులు ఉన్నట్టు అంచనా. పశ్చిమాసియా ప్రాంతంలో తన సైనిక వ్యవహారాలకు ఈ కేంద్రం అమెరికాకు ఎంతో కీలకమైనది.

“అందరికి అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్‌లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్‌ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఇజ్రాయెల్ దానిని అనుసరిస్తుంది. దీంతో 12 రోజుల యుద్ధం ముగియనుంది” అని ట్రంప్ తెలిపారు. 

“ఒక దేశం కాల్పుల విరమణ పాటించేప్పుడు మరో దేశం శాంతి, గౌరవంతో ఉండాలి. అన్నీ సరిగానే జరుగుతాయని భావిస్తున్నా. ఈ యద్ధం ఏండ్ల తరబడి కొనసాగితే పశ్చిమాసియా నాశనమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇక ముందూ అలా జరగదు. ఇజ్రాయెల్, ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్యం, ప్రపంచ దేశాలతోపాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ఇరాన్‌, కాల్పుల విరమణపై గానీ, సైనిక కార్యకలాపాలను ఆపేందుకుగానీ ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్చి స్పష్టం చేశారు. అయితే యుద్ధం కొనసాగించాలన్న ఆలోచన తమకు లేదని తెలిపారు.  “ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రారంభించింది. వాళ్లు దాడులు ఆపితే తాము ఆపేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరుగలేదు. సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తీసకుంటాము” అని  చెప్పారు.

ట్రంప్ చెప్పిన ప్రకారం, ఈ సీజ్‌ఫైర్ రెండు దశల్లో అమలవుతుంది. మొదటి దశలో ఇరాన్ 6 గంటల్లో తన సైనిక చర్యను ఆపుతుంది. 12 గంటల పాటు యుద్ధాన్ని నిలిపేస్తుంది. రెండో దశలో 12 గంటల అనంతరం ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపుతుంది. ఈ విధంగా 24 గంటల అనంతరం యుద్ధం అధికారికంగా ముగుస్తుంది.  ఈ సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానిపై ఒకటి గౌరవంతో, శాంతిగా వ్యవహరించాలని ట్రంప్ కోరారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే, ఇరాన్ మళ్లీ దాడులకు దిగనంతకాలం కాల్పుల విరమణ తమకు అంగీకారమేనని ఇజ్రాయెల్ పేర్కొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

ఆదివారం తెల్లవారుజామున తమ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన వెంటనే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. అందులో భాగంగానే అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడికి పాల్పడింది. అయితే ఇది మొదటి దాడి మాత్రమేనని ఇరాన్‌ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. తమ అణుకేంద్రాలపై దాడికి అమెరికా ఎన్ని బాంబులను ఉపయోగించిందో తాము కూడా తమ ప్రతీకార దాడిలో అదే సంఖ్యలో బాంబులను ఉపయోగించామని ఇరాన్‌ జాతీయ భద్రతా మండలి తెలిపింది. 

దోహా సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వెలువడినట్టు ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ రాయిటర్స్‌, ఏఎఫ్‌పీ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఖతార్‌ తన గగనతలాన్ని మూసివేసింది. సురక్షిత స్థానాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్‌లు ఖతార్‌లోని తమ పౌరులకు సూచించాయి. మరోవైపు ఇరాక్‌లోని అయిన్‌ అల్‌ అసద్‌ బేస్‌పైనా ఇరాన్‌ రాకెట్లు ప్రయోగించింది. అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఈ దాడులు ప్రమాదకరమైన మలుపుగా నిపుణులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరించే అవకాశం ఉన్నదని ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇరాన్‌ ప్రతీకార చర్యల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెంటనే సిట్యుయేషన్‌ రూమ్‌కు చేరుకున్నట్టు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, సైనిక దళాల ముఖ్యుల చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కెయిన్‌ కూడా ఉన్నట్టు తెలిపాయి. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకున్న అనంతరం ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.