
డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం ఏడాదిలోనే అన్నీ చేశామని చెప్పడం లేదని, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాట్లాడుతూ సూపర్-6తో పాటు మరికొన్ని ఎన్నికల హామీలు ఇచ్చామని, వీటి అమలుపై సమీక్ష చేసుకుంటున్నామని తెలిపారు.
ఎన్నికల ముందు పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనినే పొలికటికల్ గవర్నెన్స్ అంటారని, ఇది ఉంటేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు చాలా ఉన్నాయని, ప్రజలు కూటమిపై పెట్టుకున్న ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.
కేంద్రం సహకారం లేకుంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అందరి ఉమ్మడి లక్ష్యం 2029 – 2047 కావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకే పి4 విధానమని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని, నిర్ధిష్ట లక్ష్యాలతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తయితేనే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
తమది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి రౌడీయిజం చేస్తే కాళ్లు విరగ్గొట్టి కింద కూర్చో బెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బెదిరింపులకు భయపడమని పేర్కొంటూ అన్నీ చూశాకే ఇక్కడవరకు వచ్చామని చెప్పారు.
దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. మోదీ నిర్ధేశించిన వికసిత్ భారత్ లక్ష్యాలు కలిసికట్టుగా అందుకుందామని పిలుపు నిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలు ఆమె అందుకునే దిశగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రథసారథుల్లా పని చేస్తున్నారని కొనియడారు.
More Stories
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం
టిటిడిపై మరో వివాదంలో మాజీ చైర్మన్ భూమన